భారతీయ జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తన పుత్రరత్నం రాహుల్ గాంధీపై పుత్రోత్సాహం ప్రదర్శించారు. బుధవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో ఆమె నవ్వుతూ మాట్లాడుతూ "ఇప్పుడు రాహుల్ గాంధీ నాకు బాస్. తనపై నాకు ఎలాంటి సందేహాలు లేవు. మీరందరి సహకారాలతో ఆయన ముందుకు వెళ్తారు" అని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. "ఇప్పటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతోంది. అయినా నిరుద్యోగులకు రావాల్సిన ఉపాధి అవకాశాలు రావడం లేదు. దళితులపై దాడులు జరుగుతున్నాయి. రాజకీయాల పేరుతో ఆగడాలకు పాల్పడుతున్న వారిని దర్యాప్తు చేసే ఏజెన్సీలు, పోలీసులు నియంత్రించలేకపోతున్నారు. పార్లమెంటు మాత్రమే కాదు.. జ్యుడిషియరీ, మీడియా, సివిల్ సొసైటీ అన్నీ ప్రమాదపుటంచులపై ఉన్నాయి" అని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు.


ఇటీవలే జరిగిన బై ఎలక్షన్స్ పై సోనియా మాట్లాడుతూ "గుజరాత్, రాజస్థాన్ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు మేము అధికారపార్టీని కట్టడి చేయడానికి ప్రయత్నించాం. రాబోయే మార్పుకి ఇవి సంకేతాలు. కర్ణాటకలో కూడా మళ్లీ కాంగ్రెస్ రావచ్చు అనే భావనకు కూడా ఇవి శుభ సూచికలు" అని సోనియా తెలిపారు. అలాగే బుధవారం కాంగ్రెస్‌ను విమర్శిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల పై కూడా సోనియా స్పందించారు.


తమకు ఇలాంటి బెదిరింపులు కొత్తవేమీ కాదని తెలిపారు. ప్రధాని ఎన్ని మాటలు చెప్పినా.. ప్రజలు తమకు ఉపాధి చూపించేవారిని.. భవిష్యత్తుపై ఆశలు కల్పించేవారినే ఎంచుకుంటారని ఆమె తెలిపారు. ఆ పనులు బీజేపీ కన్నా కాంగ్రెస్ మెరుగ్గా చేయగలదని ఆమె అన్నారు.