న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించనున్నారు. అయినప్పటికీ, రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీ నుండి డిసెంబరు 16న అధికారపగ్గాలు తీసుకోనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ ఉపసంహరణకు సోమవారమే చివరి రోజు. అయితే రాహుల్ మినహా మరెవరూ రంగంలో లేకపోవడంతో.. రాహుల్ ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించవచ్చు. సో.. అనధికారికంగా ఆయన నేటి నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైనట్టే..! 


నవంబరు 20న రాహుల్ ను పార్టీ అధ్యక్షుడిని చేయడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్, మన్మోహన్ సింగ్, సీనియర్ పార్టీ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్ తో సహా మరికొందరు హాజరయ్యారు. సోనియా నివాసంలో ఈ సమావేశం జరిగింది.


జనవరి 2013లో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీ నియమితులైన సంగతి తెలిసిందే ..! 1998 నుండి నేటివరకు దీర్ఘకాలికంగా పార్టీ అధినేత్రిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. 


47 ఏళ్ల రాహుల్ గాంధీ..  మోతిలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీల తర్వాత పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టే ఆరవ నెహ్రూ-గాంధీ వారసుడు.


ఒకప్పుడు దేశంలో దాదాపు సగభాగాన్ని కంట్రోల్ చేసిన కాంగ్రెస్.. ఆతర్వాత క్రమక్రమంగా ప్రభావం కోల్పోతూ వచ్చింది. కేవలం ఐదు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.


కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టబోయే రాహుల్ గాంధీ చాలా కృషి చేయాల్సి ఉంది.