గతం కంటే మరింత యాక్టివ్ గా రాహుల్ పోరుబాట !!
ప్రజా సమస్యలపై గతం కంటే 10 రెట్లు ఎక్కువగా పోరాడతానని రాహుల్ గాంధీ ప్రకటించారు
ముంబై కోర్టు నుంచి బెయిల్ లభించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకే తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. తన పోరాటం వ్యక్తిగతం కాదని... సిద్ధాంతాలతో కూడిన పోరాటమని వివరించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజా సమస్యల పోరాటం విషయంలో తాను వెనక్కి తగ్గబోనని రాహుల్ తెలిపారు.
కేసుల పేరుతో ప్రభుత్వ బెదిరింపులకు తాను భయపడబోనన్న రాహుల్ గాంధీ... పేదలు, రైతులకు అండగా తాను ఉంటానని..వారి తరఫున తన పోరాటం కొనసాగుతుందన్నారు. గత ఐదేళ్లలో తాను చేసిన పోరాటం కంటే ఇకపై 10 రెట్లు ఎక్కువగా పోరాటం చేస్తానని..దమ్ముంటే ప్రభుత్వం దీన్ని అడ్డుకోవాలని రాహుల్ ఛాలెంజ్ చేశారు.
ఎన్నికల్లో పార్టీకి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా విషయంలో పార్టీ నేతలు ఎంతాగా వారించిన ఈ విషయంలో వెనక్కి తగ్గబోనని రాహుల్ కుండబద్దలు కొట్టిన చెప్పేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను ట్విట్టర్ లో కూడా పోస్టు చేశారు. ఇక రాహుల్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పాల్గొనబోరనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో మళ్లీ రాహుల్ నోట పోరుబాట వినిచడం గమనార్హం. అది కూడా గతం కంటే 10 రెట్లు ఎక్కువగా పోరాటం చేస్తానని చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.