ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "సంత్ సమ్మేళన్" అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 2019 లోక్ సభ ఎన్నికలకు ముందే అయోధ్యలో రామ మందిర  నిర్మాణం జరిగిపోతుందని జోస్యం చెప్పారు. అయితే అంతా ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతుందని ఆయన తెలిపారు. ఏదో ఒక రోజు అనుకోకుండా రామ మందిర నిర్మాణం జరిగిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదిత్యానాథ్ వ్యాఖ్యలు చేయకముందే బీజేపీ నేత రామ్ విలాస్ వేదాంతి మాట్లాడారు. మొఘల్ చక్రవర్తి బాబరు ఎలాంటి కోర్టు ఆర్డర్లు తీసుకోకుండానే భారతదేశంలో ఆలయాలను కూల్చాడని.. అలాగే బాబ్రీ మసీదు కూల్చివేతలప్పుడు కూడా ఎలాంటి కోర్టు ఆదేశాలు రాలేదని అన్నారు. ఆ మాటలకు సమాధానంగా యోగి ఆదిత్యనాథ్ పై వ్యాఖ్యలు చేశారు. 


"మనం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రాముడి దయ ఉంటే మందిరం అయోధ్యలో నిర్మించబడుతుంది. అందులో సందేహమే లేదు. అందుకే, మీరు కూడా సహనం కలిగి ఉండాలి. వివేకంగా ఆలోచించాలి. అప్పుడే మనం అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి. నాకు తెలిసి 2019 ఎన్నికలకు ముందే రామ మందిర నిర్మాణం జరిగిపోతుంది" అని ఆదిత్యనాథ్ అన్నారు.