Nipah Virus: ఓవైపు కరోనా...మరో వైపు నిఫా వైరస్ కేరళను కలవరపెడుతున్నాయి. ఆదివారం కోజికోడ్‌లోని చాత్తమంగ‌ళం పంచాయతీలో నిఫా వైరస్ సోకి 12 ఏళ్ల బాలుడు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మరింతగా అప్రమత్తమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ పండే కారణమా?
 కేరళలో (Kerala) నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించిన సంగతి తెలిసిందే. ఈ బృందం నిఫా వైరస్ కారణంగా చనిపోయిన బాలుడి కుటుంబాన్ని సందర్శించింది. అయితే ఈ సందర్భంగా బాలుడి కుటుంబ సభ్యులు తమ అనుమానాలను ఆ బృంద సభ్యులకు తెలియజేశారు. రంబుటాన్ (Rambutan) పండ్లు తినడం వల్లే బాలుడికి నిఫా వైరస్ బారినపడినట్టుగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో బృంద సభ్యులు బాలుడి ఇంటికి సమీప ప్రాంతాల్లో ఉన్న రంబుటాన్ పండ్లను నమునాలను సేకరించింది.


పుణేకు శాంపిల్స్
ఆ తర్వాత నిఫా వైరస్ స్వల్ప లక్షణాలు ఉన్న 8 మంది శాంపిల్స్‌ను, రంబుటన్ పండ్లను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి (National Institute of Virology) పరీక్షల నిమిత్తం అధికారులు పంపించారు. అలాగే బాలుడికి ప్రైమరీ కాంటాక్ట్‌లుగా మొత్తం 251 మందిని వైద్య అధికారులు గుర్తించారు. వారిని నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. చాత్తమంగ‌ళం పంచాయ‌తీ(Chathamangalam Panchayat)తోపాటు చుట్టుప‌క్కల ప్రాంతాల‌ను పూర్తిగా నిర్బంధంలో ఉంచారు. బాలుడి ఇంటి చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల మేర కంటైన్‌మెంట్ జోన్ ఏర్పాటు చేశారు.


Also Read: Nipah Virus: కేరళలో మరో కలకలం, నిఫా వైరస్ కారణంగా బాలుడి మృతి


కాంటాక్ట్ ట్రేసింగ్‌ను బలోపేతం చేయడం, సంక్రమణ మూలాన్ని గుర్తించడానికి ఆరోగ్య శాఖ ప్రాధాన్యత ఇస్తుందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ (Veena George) తెలిపారు. తల్లిదండ్రులు బాలుడిని ముందుగా క్లినిక్‌కు, తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత మెడికల్ కాలేజీకి, అక్కడి నుంచి మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో కాంటాక్ట్‌ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని వీణా జార్జ్ చెప్పారు. ‘బాలుడి 20 హై రిస్క్‌ కాంటాక్ట్‌లలో ఏడుగురి నమూనాలను పరీక్షల నిమిత్తం పుణెలోని ఎన్‌ఐవీకి టెస్టింగ్ కోసం పంపడం జరిగింది. ఈ రోజు ఇందుకు సంబంధించిన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. మేము NIV భోపాల్ సహాయం కూడా కోరాం. పుణె ఎన్‌ఐవీ నేడు కోజికోడ్ మెడికల్ కాలేజ్ టెస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఫలితాలు వేగంగా పొందడానికి మాకు సహాయ పడుతుంది’అని వీణా జార్జ్ తెలిపారు.


నిఫా వైరస్‌(Nipah Virus)తో చనిపోయిన బాలుడికి తొలుత ఆగస్టు 27న జ్వరం వచ్చింది. దీంతో అతని తల్లిదండ్రులు స్థానిక క్లినిక్‌లో చేర్పించారు. ఆ తర్వాత బాలుడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి, ఆ తర్వాత వేరే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడి పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం 5 గంటలకు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆగస్టు 27 నుంచి బాలుడు.. ఏ సమయంలో ఎక్కడున్నాడనే పూర్తి వివరాలతో కూడిన రూట్ మ్యాప్‌ను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. నిఫాకు సంబంధించిన ఏవైనా లక్షణాలు ఉంటే ఆరోగ్య శాఖను సంప్రదించాలని ప్రజలను కేరళ సర్కార్ కోరింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook