నిబంధనలు ఉల్లంఘించిన 9 బ్యాంకులపై కన్నెర్ర చేసిన ఆర్బిఐ
నిబంధనలు ఉల్లంఘించిన 9 బ్యాంకులపై కన్నెర్ర చేసిన ఆర్బిఐ
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నిబంధనల మేరకు ఆర్బిఐ వద్ద లైసెన్స్ పొంది వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోన్న బ్యాంకులు ఏవైనా తమ బ్యాంకులో జరిగిన మోసాలను వెంటనే ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఆ నిబంధనలు ఉల్లంఘించిన పలు బ్యాంకులపై కన్నెర్ర చేసిన ఆర్బిఐ.. ఆయా బ్యాంకులపై భారీ మొత్తంలో జరిమానా విధించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంకు(పిఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబి), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబిఐ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబిసి) ఉన్నాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కుంభకోణం కేసులో మోసాన్ని వెల్లడించడంలో జాప్యంతోపాటు ఇతర మోసాలను వెల్లడించడంలో జాప్యం చేయడాన్ని తప్పుపడుతూ ఆర్బిఐ ఈ జరిమానాలు విధించింది.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మోసాన్ని వెల్లడించడంలో జాప్యం చేసినందుకుగాను ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు రూ.1.5 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.50 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ఆర్‌బీఐ స్పష్టంచేసింది. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లకు రూ.కోటి చొప్పున జరిమానా విధించారు. కార్పొరేషన్ బ్యాంకుకు రూ.కోటి, అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు రూ.2 కోట్ల చొప్పున, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు, యూబీఐలకు రూ.1.5 కోట్ల చొప్పున, ఓబీసీకి రూ.1 కోటి, ఎస్‌బీఐకి రూ.50 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్‌లకు రూ.50 లక్షల చొప్పున, ఆర్‌బీఐ జరిమానా విధించింది. ఆర్‌బీఐ నుంచి ఆదేశాలు అందిన తర్వాత 14 రోజుల్లోగా బ్యాంకులు ఈ జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ తమ ఆదేశాల్లో స్పష్టంచేసింది.