మానవాళిని మహమ్మారిలా పీడిస్తోంది 'కరోనా వైరస్'. దాని దెబ్బకు అగ్రరాజ్యం నుంచి అతి చిన్న దేశం దాకా గజగజలాడుతున్న పరిస్థితి ఉంది. ప్రపంచ మానవాళి.. అంతా చిగురుటాకులా వణుకుతున్నారు. లక్షల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అంతే దాదాపు 11 లక్షలకు పైగా కరోనా బారిన పడ్డవారు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత దేశంలోనూ కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. కరోనా దెబ్బకు 27  వేల 892 మంది ఆస్పత్రిపాలయ్యారు. ఇప్పటికే 872 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని 6 వేల 185 మంది సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు. భారత దేశంలో మొత్తంగా చూసుకుంటే మరణాల శాతం తక్కువగా ఉంది. దీనికి వైద్యులు అనుసరిస్తున్న విధానమే కారణం. కరోనా వైరస్ సోకిన రోగులు చికిత్స తీసుకుని సురక్షితంగా బయటపడడానికి ముఖ్య కారణం వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండడమే. ఇప్పుడు అలాంటి వారి నుంచి రక్తాన్ని సేకరించి.. అందులోని ప్లాస్మా ద్వారా మిగతా కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.


ఢిల్లీ ఎయిమ్స్ లో ప్రారంభించిన ఈ వైద్య విధానం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి. అందుకే కరోనా వైరస్ నుంచి సురక్షితంగా బయటపడ్డవారు రక్తదానం చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. తద్వారా మరికొంత మందిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని తెలిపారు. దీంతో ఒక్కొక్కరుగా రోగం నుంచి బయటపడ్డవారు ముందుకొస్తున్నారు. 


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిలుపు మేరకు  తబ్రేజ్ ఖాన్ అనే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి తన కరుణ హృదయాన్ని చాటుకున్నారు. తనలా మరికొంత మంది కూడా కరోనా మహమ్మారి నుంచి బయటపడాలన్న ఉద్దేశ్యంతో రక్తదానం చేశారు. తన రక్తంలోని ప్లాస్మా ఇతరులకు ఉపయోగపడడం ఆనందంగా ఉందని ఆయన చెబుతున్నారు. మరొకరి జీవితానికి అది ఉపయోగపడుతుందంటే అంత కంటే కావాల్సిందేముంటుందంటున్నారు.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..