ఎండ వేడిమి నుంచి మరికొద్దిరోజుల్లోనే ఉపశమనం..! తీపి కబురు మోసుకొచ్చింది భారత వాతావరణ శాఖ. అవును మరో మూడు రోజుల్లో వాతావరణం చల్లబడిపోతుందని భారత వాతావరణ శాఖ...IMD తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంఫాన్ తుపాన్ తో ఈశాన్య భారత దేశం కాస్త చల్లబడినా మళ్లీ ఎండలు ముదురుతున్నాయి. రోహిణీ కార్తె ప్రవేశించడంతో దక్షిణ భారత దేశం సహా ఉత్తర భారత దేశం అంతటా సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఐతే దీనికి మరో మూడు రోజుల్లో తెరపడుతుందని... వాతావరణం చల్లబడే అవకాశం ఉందని తీపీ కబురు మోసుకొచ్చింది భారత వాతావరణ శాఖ. 


మే 29, 30 తేదీల్లో ఉరుములు, మెరుపులతో  కూడిన వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఉత్తర భారత దేశంలోని చాలా రాష్ట్రాల్లో  వాతావరణ చల్లగా మారుతుందని తెలిపింది.  దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్ హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం 45  డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు  పడితే వాతావరణం చల్లగా మారే అవకాశం  ఉంది.


ఈశాన్యం నుంచి తేమగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఐతే ఇవాళ రేపు మాత్రం త్తరభారతదేశంలోని హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భలలో వడగాలులు వీస్తాయని తెలిపింది. అటు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మరట్వాడాలోని కొన్ని జిల్లాల్లో మరో రెండు మూడు రోజుల వరకు వడగాలులు  కొనసాగుతాయని వెల్లడించింది.  


మరోవైపు ఢిల్లీలో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు.  దీంతో పగటిపూట కూలర్లు, ఏసీల  వాడకం విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంది. నిన్న ఒక్కరోజే 5268 మెగా వాట్ల విద్యుత్ వినియోగించారు. ఈ  మధ్యకాలంలో ఇదే అత్యధిక వినియోగం కావడం విశేషం.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..