పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీ చేపట్టిన రాష్ట్రీయ జనతా దళ్ నేత, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అనుకోకుండా అదుపుతప్పి సైకిల్ మీది నుంచి కిందపడిపోయారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ కేబినెట్‌లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి, ఆ తర్వాత పలు విభేదాల కారణంగా నితీష్ సర్కార్‌తో బంధం తెంచుకుని రాష్ట్ర కేబినెట్ నుంచి బయటికొచ్చేసిన ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ గురువారం రాష్ట్ర రాజధాని పాట్నాలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి ఓ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

ఈ క్రమంలోనే వేగంగా సైకిల్ తొక్కుతూ ముందుకు వెళ్లిన తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ కూడలి వద్ద మలుపు తిరగబోయి అదుపుతప్పి కిందపడ్డారు. తేజ్ ప్రతాప్ యాదవ్ కిందపడటం చూసి వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని అతడిని పైకి లేపే ప్రయత్నం చేశారు. కానీ మళ్లీ తనకు తానే పైకి లేచిన యాదవ్.. తనకు గాయాలు ఏమీ అవకపోవడంతో వెంటనే మళ్లీ సైకిలెక్కి ముందుకు సాగిపోయారు. అయితే, అప్పటికే తేజ్ ప్రతాప్ యాదవ్ కింద పడిపోవడాన్ని తమ మొబైల్ కెమెరాల్లో బంధించిన ప్రత్యక్షసాక్షులు... ఆ సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సైతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.


పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటుండటంతో వాహనాలు వినియోగించడంకన్నా సైకిల్ ఉపయోగించడమే శ్రేయస్కరం అనే నినాదంతో ఈ సైకిల్ ర్యాలీ చేపట్టిన తేజ్ ప్రతాప్ యాదవ్.. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యానికి సైతం మేలు జరుగుతుందనే సందేశాన్ని ఇచ్చారు.