రొటొమ్యాక్‌ సంస్థ అధినేత విక్రమ్‌ కొఠారిని సీబీఐ అరెస్ట్ చేసింది. విక్రమ్ కొఠారితోపాటు అతడి కుమారుడు రాహుల్‌ కొఠారిని కూడా సీబీఐ అధికారులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారాభివృద్ధి పేరిట బ్యాంకుల నుంచి పొందిన రుణాలను దుర్వినియోగం, తిరిగి ఆ సొమ్మునే తన ఇతర బోగస్ కంపెనీల్లోకి మళ్లించుకున్నాడనేది కొఠారిపై నమోదైన ప్రధానమైన ఆరోపణలు. బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో పొందిన రుణాలను రొటొమ్యాక్‌ కంపెనీ దురుద్దేశపూర్వకంగానే వేరే కంపెనీల్లోకి దారి మళ్లించిందని సీబీఐ ఆరోపించింది. ఎక్స్‌పోర్ట్స్ ఆర్డర్ల కోసం ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్ చూపించి బ్యాంకులో పొందిన రుణాన్ని విదేశాల్లోని ఇతర కంపెనీలకు మళ్లించారని.. మళ్లీ ఆ డబ్బును తిరిగి కాన్పూర్‌కు చెందిన తన కంపెనీకే వచ్చేటట్టు చేశారని సీబీఐ తమ ఆరోపణల్లో పేర్కొంది. 


ఈ నేపథ్యంలోనే కొఠారీ అండ్‌ కో పై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)లు వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించాయి. ఈ కేసు విచారణలో భాగంగానే సీబీఐ విక్రమ్ కొఠారితోపాటు అతడి కుమారుడు రాహుల్‌ కొఠారిని అరెస్ట్ చేసింది.