దేశీయ కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. ముడి చమురు ధరల పెరుగుదల, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణమూ పెరుగుతుందని ఇన్వెస్టర్లలో ఆందోళన  నెలకొనడంతో రూపాయి ఆల్‌-టైమ్‌ కనిష్ట స్థాయిలకు పడిపోయింది. మొట్టమొదటిసారి డాలర్‌తో రూపాయి మారకం విలువ 49 పైసలు క్షీణించి రూ.69.10 వద్ద కొనసాగుతోంది. బుధవారం కూడా 37 పైసల మేర పడిపోయి 19 నెలల కనిష్టంలో 68.61 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. 2016 నవంబర్ 24న రూ.68.86గా ఉండటమే అంతకుముందు కనిష్ట విలువ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్ బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో బుధవారం ఉదయం 68.87 వద్ద ప్రారంభమై ట్రేడింగ్‌ ముగింపులో భారీగా పతనమైన రూపాయి, గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 49 పైసలకు పడిపోయి  రూ.69.10 వద్ద కొనసాగుతోంది.  


నవంబరు నాటికి ఇరాన్ చమురు దిగుమతులన్నీ ఆపేయాలని అమెరికా మిత్రరాజ్యాలు అడిగిన తరువాత అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. లిబియా మరియు కెనడాల్లో సరఫరా అంతరాయాలపై ఆందోళనలు కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. మరోవైపు ఆయిల్‌ ధరలు కూడా పైపైకి ఎగుస్తున్నాయన్నారు.


రూపాయి విలువ 68.80-68.85 స్థాయిల వద్ద ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాల్సి ఉందని, కానీ 68.86 మార్కు కంటే భారీగా రూపాయి పతనమైందని.. ఇక వచ్చే సెషన్లలో కచ్చితంగా రూపాయి భారీగా క్షీణిస్తుందని కొందరు ఆర్థిక విశ్లేషకులు అన్నారు. 70 నుంచి 70.50 స్థాయిలకు పడిపోయే అవకాశాలున్నాయన్నారు.


అటు దేశీయ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 44 పాయింట్ల నష్టంతో 35,172 వద్ద, నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో 10,625 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.