శబరిమలలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ శబరిమలలో నిరసనకారులు మూడో రోజూ ఆందోళనలు చేపట్టారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో శబరిమల పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అటు ఆలయంలో మహిళల ప్రవేశంపై ఆందోళనల దృష్ట్యా నేడు తిరువనంతపురంలో ట్రావెన్‌‌కోర్‌ దేవాస్యమ్‌ బోర్డు భేటీ కానుంది. సామరస్య పరిష్కారంపై బోర్డు దృష్టి పెట్టనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా ఇవాళ శబరిమలలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ హైదరాబాద్‌కు చెందిన మోజో టీవీలో రిపోర్టర్‌గా పని చేస్తున్న కవితా జక్కల్‌తో పాటు మహిళా కార్యకర్త రెహానా ఫాతిమా కొండపైకి బయల్దేరారు. వీరిద్దరూ పోలీసుల సంరక్షణల మధ్య పంబ నుంచి కొండపైకి బయల్దేరారు.


కేరళ ఐజీ ఎస్ శ్రీజిత్ వారిద్దరినీ పిలిచి మాట్లాడారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన మోజో టివి జర్నలిస్ట్ కవితా జక్కల్, మహిళా కార్యకర్త రెహానా ఫాతిమా శబరిమల నుంచి తిరుగుప్రయాణం అయ్యారు. కేరళ ఐజీ శ్రీజిత్ మాట్లాడుతూ.."ఇక్కడి పరిస్థితి గురించి మహిళ భక్తులకు చెప్పాము. వారు తిరిగి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు." అని అన్నారు.


ఐజీ మాట్లాడుతూ.. 'మేము వారిద్దరినీ ఆలయం వరకు తీసుకొచ్చాము. అయితే ఆలయ పూజారి, తంత్రీ గుడి తలుపులు తెరవడానికి నిరాకరించారు. మేము ఎదురుచూశాము. మహిళలు ప్రవేశిస్తే ఆలయాన్నే మూసేస్తామని తంత్రి చెప్పారు.'  అని అన్నారు.


గురువారం శబరిమల కొండపైకి వెళ్తున్న న్యూయార్క్ టైమ్స్ మహిళా జర్నలిస్టును ఆందోళనకారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.


ఒకవైపు మహిళాలు కొండపైకి అడుగుపెడితే అనంతరం జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి కాందరారు రాజీవారు మాట్లాడుతూ.. ' ఆలయాన్ని మోసేసి తాళం చెవిలను అప్పగించి వెళ్లాలని నిశ్చయించుకున్నాం.  నేను భక్తుల వైపు నిలబడతాను.' అన్నారు.


శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై పలువురిపై కేరళ సీఎం పి.విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ మద్దతుదారులు భక్తులను అడ్డుకుంటున్నారని, చెడును ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కుల, ఫ్యూడల్‌ భావజాలాల వల్ల ప్రేరేపితులు అవడంతోనే నిరసనకారులు హింసకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ..  ఇటువంటిఆందోళనల వల్ల సమాజంలో వెనకబడిన తరగతుల వారు కూడా శబరిమలకు రాకుండా నిషేధం విధించేలా పరిస్థితులు తలెత్తుతాయని, దీన్ని అందరూ ఖండించాలని విజయన్ ట్విట్టర్ ద్వారా తెలియాజేశారు.


రుతుస్రావం అయ్యే మహిళలకు శబరిమల కొండపైకి వెళ్లడం నిషేధమైనప్పటికీ.. గత నెలలో అన్ని వయసుల మహిళలు శబరిమలకు వెళ్లొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.


ఆలయంలోకి మహిళలందరికీ అనుమతినిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తరువాత మొదటిసారిగా నెలవారీ పూజల నిమిత్తం శబరిమల అయ్యప్ప ఆలయం బుధవారం తెరుచుకొంది. అయితే ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి వీల్లేదంటూ కొన్ని సంఘాలు చేస్తున్న ఆందోళనలతో శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.