బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్‌కి భారీ భద్రత కల్పించారు ముంబై పోలీసులు. కృష్ణ జింక వేట కేసుకు సంబంధించిన విచారణ కోసం ఇటీవల సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ కోర్టుకి హాజరైన సంగతి తెలిసిందే. మరో కేసులో ఇదే కోర్టుకు హాజరైన లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్ సల్మాన్ ఖాన్‌ని చంపేస్తానని బెదిరింపులకి పాల్పడిన నేపథ్యంలోనే సల్మాన్‌కి భద్రతని కట్టుదిట్టంచేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రేస్ 3 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. బుధవారం ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన ముంబై పోలీసులు... సల్మాన్ ఖాన్ ప్రాణాలకి హాని పొంచి వున్నందున అత్యవసరంగా అతడిని సురక్షితంగా ఇంటికి తరలించాల్సిన అవసరం వుందని చిత్ర నిర్మాత రమేష్ తౌరానికి తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలోకి కొంతమంది సాయుధులు ఆయుధాలతో చొరబడ్డారని నిర్మాతకు చెప్పిన పోలీసులు.. అందుకే వెంటనే సల్మాన్ ఖాన్‌ని అక్కడి నుంచి క్షేమంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై వుందని తెలియజేశారు. అంతేకాకుండా షూటింగ్ జరుగుతున్న ప్రాంతం నుంచే సల్మాన్‌ని తమ కారులో సురక్షితంగా తీసుకెళ్లి అతడి ఇంటివద్ద దింపారు. 


సల్మాన్ ఖాన్‌ని ఇంటికి తీసుకెళ్లే సమయంలోనూ పోలీసులు భారీ ప్రణాళికను అనుసరించారు. ఆరుగురు సాయుధులైన పోలీసు సిబ్బంది సల్మాన్ ఖాన్‌ని ఓ కారులో ఇంటికి తీసుకెళ్లగా.. సల్మాన్ సొంత కారులో ఇంకొంత మంది పోలీసులు ఆ కారుని అనుసరిస్తూ వెళ్లడం గమనార్హం. సల్మాన్ ఖాన్‌కి బెదిరింపుల నేపథ్యంలో రేస్-3 సినిమా షూటింగ్ స్పాట్ వద్ద నిర్మాత రమేష్ తౌరాని సైతం భద్రతను పెంచారు.