సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.  అలోక్ వర్మ, అస్థానాలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేధిక సమర్పించాలని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీనికి రెండు వారాల గడువు విధించింది. సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీవీసీ ఈ విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం తమ ఆదేశాల్లో పేర్కొంది. ఇదే సందర్భంలో తాత్కాలిక సీబీఐ చీఫ్‌గా నియమితులైన ఎం నాగేశ్వరరావు ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోరాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణ నవంబర్ 12 వరకు కోర్టు వాయిదా వేసింది.


తమ క్లైంట్ అలోక్ వర్మను అకారణంగా పదవి నుంచి తప్పించి సెలవులపై పంపించి కేంద్ర ప్రభుత్వం తనను అవమానించిందని సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ తనఫున న్యాయవాది వాదించారు. ఈ  సందర్భంగా  సీవీసీ తరఫున అటార్ని జనరల్ వాదిస్తూ సీబీఐ డైరెక్టర్‌గా వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌గా అస్థానాను సెలవుపై మాత్రమే పంపామని.. వారిని పదవుల నుంచి తొలగించలేదని వారు తమ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు, సీబీఐలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ మేరకు సెలవు ప్రకటించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇరువైపుల నుంచి వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది