ఒక రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీలు వేరే ఇతర రాష్ట్రాల్లో ఒకవేళ తమ కులాన్ని నోటిఫై చేయలేకపోతే వారు ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ పొందలేరని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు అయిదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ఒక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలుగా పరిగణించబడిన వారు.. వేరే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్య లేదా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేటప్పుడు వారిని అక్కడ అలాగే పరిగణించే అవకాశం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవేళ అలా పరిగణిస్తే.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల అవకాశాలకు గండి పడే అవకాశం ఉందని కూడా తీర్పులో తెలిపారు. అందుకే ఒక రాష్ట్రానికి చెందిన ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు వేరే రాష్ట్రానికి వెళ్లి అదే హోదా కోరే అవకాశం లేదని కోర్టు తెలియజేసింది. ఒక రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక హక్కులను వేరే రాష్ట్రానికి బదిలీ చేసే అవకాశం లేదని.. అలా చేస్తే రాజ్యాంగంలోని 341, 342 ఆదికరణలకు భంగం కలుగుతుందని కోర్టు తెలిపింది. 


అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి.. ఎస్సీ, ఎస్టీలకు సెంట్రల్ రిజర్వేషన్ పాలసీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విద్య, ఉపాధి అవకాశాల విషయంలోనే తాజా తీర్పు వర్తిస్తుందని కోర్టు తెలిపింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన విద్య, ఉపాధి విషయంలో కూడా సెంట్రల్ రిజర్వేషన్ పాలసీ వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది. అయితే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి.. అక్కడ కూడా సెంట్రల్ రిజర్వేషన్ పాలసీ వర్తింపజేయడం పట్ల ధర్మాసనంలో సభ్యురాలైన జస్టిస్ భానుమతి అభ్యంతరం తెలిపారు.