సీనియర్ కాంగ్రెస్ నేత మరియు మాజీ కేంద్ర మంత్రి గురుదాస్ కామత్ ఈ రోజు ఉదయం మరణించారు. 63 సంవత్సరాల కామత్ ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో తనకు శ్వాసకోశంలో ఏవో ఇబ్బందులు తలెత్తుతున్నాయని..ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుందని తెలపడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ప్రిమస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగానే ఆయన మరణించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురుదాస్ మరణవార్త కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. గురుదాస్ మరణవార్త తెలియగానే కాంగ్రెస్ నేత సోనియా గాంధీ హుటిహుటిన ప్రిమస్ ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబీకులను పరామర్శించారు. కామత్ మరణంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే హోంమంత్రి రాజనాథ్ సింగ్ కూడా కామత్ కుటుంబసభ్యులకు తన సంతాపాన్ని తెలిపారు. 


అక్టోబరు 5, 1954 తేదిన కర్ణాటకలో జన్మించిన గురుదాస్ కామత్, ముంబయిలోని ఆర్ ఏ పోదర్ కళాశాలలో కామర్స్‌లో డిగ్రీ చేశారు. ఆ తర్వాత ముంబయి ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1984లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన కామత్.. మహారాష్ట్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్‌కు ప్రెసిడెంటుగా సేవలందించారు. ముంబయి తూర్పు పశ్చిమ నియోజకవర్గం నుండి 2009లో ఎంపీగా ఎన్నికైన గురుదాస్.. 1984,1991,1998,2004 సంవత్సరాలలో వరుసగా ముంబయి పశ్చిమ తూర్పు నియోజకవర్గం నుండి కూడా ఎంపీగా గెలిచారు.


ఆ తర్వాత 2009 నుండి 2011 వరకు కాంగ్రెస్ హయాంలో హోంశాఖ సహాయమంత్రిగా.. సమాచార, ప్రసార శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. జులై 2011 నెలలో ఆయన మంత్రిగా రిజైన్ చేశారు. 2013లో కామత్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2014లో మాత్రం మళ్లీ ఎంపీగా పోటీ చేసినా.. కామత్ గెలవలేకపోయారు. తర్వాత క్రమంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేశారు.