ముంబై: శివసేన అధినేత ఉద్దవ్ థాకరే(Uddhav Thackeray) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ వేడుకకు వేదికైన శివాజీ పార్కులో చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. సాయంత్రం 6.40 గంటలకు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేత, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ తోరట్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులతో పాటు శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే, సుభాష్ దేశాయ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీళ్లే కాకుండా ఎన్సీపీ నుంచి చగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్ వంటి నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు సమాచారం అందుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 3లోగా 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో బల పరీక్ష జరగాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : ఉద్ధవ్ థాకరేకు షాకిచ్చిన అజిత్ పవార్ అభిమానులు


ఇదిలావుంటే, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌ కూడా ఉద్ధవ్ థాకరేతో పాటే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని భావించినప్పటికీ.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం ఈ విషయంలో మరో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఉద్ధవ్ థాకరేతో పాటే అజిత్ పవార్ చేత ప్రమాణం చేయించకుండా.. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడి, అసెంబ్లీలో బల పరీక్ష నిరూపించుకున్న తర్వాతే అజిత్ పవార్ చేత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని శరద్ పవార్ కోరుకుంటున్నారట. ఇదే విషయాన్ని ఆయన శివ సేన, కాంగ్రెస్ పార్టీలతోనూ చర్చించినట్టు సమాచారం. 


Read also: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అనంతరం దేవేంద్ర ఫడ్నవిస్ ఏమన్నారంటే..


మహారాష్ట్రలో అధికారం పంచుకోవడంపై ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. తమ పార్టీ నుంచి ఒకరు ఉప ముఖ్యమంత్రిగా ఉండనుండగా స్పీకర్ పదవి కాంగ్రెస్ పార్టీ నేతకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలిపారు.