రాజకీయ పార్టీలు ఆర్థికంగా నిధుల కొరతతో బాధపడుతున్న మాట వాస్తవమేనని, అందులోనూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఆ ఆర్థిక ఇబ్బంది మరీ ఎక్కువగా వేధిస్తోందని అంగీకరించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్. భారతీయ జనతా పార్టీకే అధిక మొత్తంలో పొలిటికల్ ఫండింగ్ వెళ్తోందని, అధికారంలో వున్న పార్టీకి నిధులు అందడం సహజమే కదా అనే రీతిలో శశి థరూర్ అభిప్రాయపడ్డారు. శశి థరూర్ ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ నిధుల లేమితో సతమతమవుతోందనే కథనాలు పతాకశీర్షికలకు ఎక్కుతున్న తరుణంలో శశిథరూర్ ఏఎన్ఐతో చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజకీయ పార్టీలకు నిధులు అందని నేపథ్యంలో క్రౌడ్‌ఫండింగ్‌ (ప్రజలే స్వచ్ఛందంగా నిధులు అందివ్వడం) పద్ధతిని అనుసరించడమే ఇక సరైన మార్గమేమో అని శశి థరూర్ పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కర్ణాటక ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరికి వారే తమ తమ ఖర్చులని భరించుకున్నారు. ఒక్క సందర్భంలో మాత్రమే క్రౌడ్ ఫండింగ్ పద్ధతిని అనుసరించడం జరిగింది. అది సత్ఫలితాలను అందించింది కూడా. అందుకే రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ క్రౌడ్‌ఫండింగ్ పద్ధతిని అవలంభించాలని యోచిస్తున్నట్టు శశి థరూర్ తెలిపారు.