హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై శివసేన ఆసక్తికరమైన వ్యాఖ్యలు
దిశపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో ఉన్న నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసుల చర్యను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధినేతగా ఉన్న శివ సేన పార్టీ స్వాగతించింది. ఈ మేరకు శనివారం శివసేనకు చెందిన సామ్నా పత్రికలో ఓ సంపాదకీయ కథనం ప్రచురితమైంది.
హైదరాబాద్‌లో జరిగిన ప్రభుత్వ వెటర్నరీ వైద్యురాలు దిశపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో ఉన్న నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసుల చర్యను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధినేతగా ఉన్న శివ సేన పార్టీ స్వాగతించింది. ఈ మేరకు శనివారం శివసేనకు చెందిన సామ్నా పత్రికలో ఓ సంపాదకీయ కథనం ప్రచురితమైంది. దిశపై అత్యాచారం చేసిన నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని ప్రశంసిస్తూ దిశ కుటుంబానికి న్యాయం జరిగిందని సామ్నా కథనం పేర్కొంది. దర్యాప్తులు , కోర్టులు, చార్జిషీట్లు అంటూ ఆలస్యం చేయకుండా పోలీసులు ఎన్నుకున్న సత్వర మార్గం సరైనదేనని సామ్నాలో శివసేన పేర్కొంది.
తెల్లవారుజామున హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్తుండగా తప్పించుకోవడానికి ప్రయత్నించారని నలుగురు రేపిస్టులు పోలీసులపై ఎదురుదాడి చేయడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని పేర్కొనగా, అత్యాచార నిందితులు నలుగురు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉన్నప్పుడు కస్టడీ నుండి పారిపోవడానికి ప్రయత్నించడం సాధ్యం కాదని సామ్నా సంపాదకీయ కథనంలో ప్రస్తావించినప్పటికీ.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని పేర్కొంది.
నవంబర్ 28న గురువారం హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై చటాన్‌పల్లి వద్ద ఉన్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కల్వర్టు కింద దిశ శవం లభ్యమైంది. 26 ఏళ్ల వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం చేసి చంపిన కొద్ది రోజులకే.. యువతి శవాన్ని ఎక్కడైతే దహనం చేశారో... అదే చోట నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. హత్య ఘటన కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. పోలీసులు వెంటనే ఈ కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను మహ్మద్ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులను నవంబర్ 29 శుక్రవారం వారి ఇళ్ల వద్ద నుంచి అదుపులోకి తీసుకొన్నారని సామ్నా పేర్కొంది.
సామ్నా ప్రచురించిన కథనం ప్రకారం.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దిశ హత్య కేసు ఘటన పునర్నిర్మాణం కోసం నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లామని.. ఆ క్రమంలోనే నిందితులు పోలీసులపై తిరగబడి దాడి చేసేందుకు యత్నించారని తెలిపారు. ఇద్దరు నిందితులు మహ్మద్ ఆరిఫ్ పాషా, చింతకుంట చెన్నకేశవులు పోలీసుల నుండి ఆయుధాలు లాక్కొని తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. మరో ఇద్దరు నిందితులు జోల్లు నవీన్, జోల్లు శివ పోలీసులపై రాళ్లతో దాడి చేశారని వివరించారు. ఈ దాడిలో సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పోలీసు కానిస్టేబుల్ అరవింద్ గౌడ్‌లకు గాయాలయ్యని విసి సజ్జనార్ వెల్లడించారు. నిందితులు అదుపులో లేకపోవడంతో.. ఆత్మరక్షణ కోసం తాము జరిపిన కాల్పుల్లోనే ఆ నలుగురు మృతిచెందారని పోలీసులు వెల్లడించినట్టుగా సామ్నా కథనం పేర్కొంది.
ఇదిలావుంటే, అత్యంత నాటకీయ పరిణామాల ఎన్‌కౌంటర్‌కి గురైన నలుగురు నిందితుల మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. నిందితుల శవాలను డిసెంబర్ 9 రాత్రి 8 గంటల వరకు ఆసుపత్రి మార్చురీలోనే భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే.