మందలించినందుకు మేనత్తను హతమార్చిన టెన్త్ విద్యార్థి !
తమిళనాడులో సంచలన ఘటన చోటు చేసుకుంది. మందిలించిందనే కారణంతో తన మేనత్తను హతమార్చాడు ఓ టెన్త్ విద్యార్ధి. సంచలనం రేకెత్తిస్తున్న ఈ ఘటన సోమవారం చెన్నైపట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే చెన్నైలోని వల్లలార్కు చెందిన శంకర్ సుబ్బు , తమిళ్ సెల్వి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పనిపూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన శంకర్ తన భార్యను స్పృహ తప్పిన స్థితిలో చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోస్టుమార్టం రిపోర్టులో ఆమె గొంతును ఎవరో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా శంకర్ సోదరి కుమారుడైన టెన్త్ చదువుతున్న విద్యార్థి ఆ ఇంటికి వచ్చినట్టు గుర్తించారు.
పోలీసులు నిందితుడిని తమ అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటికి వచ్చింది. తన కూతురిని కలవద్దని మేనత్త ఆంక్షలు విధించిందని.. అందుకే ఈ దారుణానికి వడిగట్టానని నిందితుడు తెలిపాడు. పట్టుమని పదోతరగతి కూడా పూర్తి చేయని ఈ విద్యార్ధిలో ఇంతటి క్రూరమైన ఆలోచన తట్టడంపై స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.