శ్రీనగర్ : 44 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిన ఘటన జమ్ముకాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా మజాల్తా వద్ద చోటుచేసుకుంది. నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు సురిన్‌సార్ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 


ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. జమ్ముకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎత్తైన రహదారులపై రాకపోకలు సాగిస్తున్న వాహనాలు తరచుగా ప్రమాదంబారిన పడుతుండటం అక్కడివారిని ఆందోళనలకు గురిచేస్తోంది.