మాజీ సీఎం అల్లుడు అదృశ్యం, ఇంతకీ సిద్ధార్థ ఏమైనట్లు ?
కాఫీడే అధినేత సిద్దార్థ అదృశ్యమైన ఘటన కర్నాటకలో కలకలం రేకెత్తిస్తోంది
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఎస్.ఎం.కృష్ణ అల్లుడు కాఫీ డే యాజమాని వి.జి.సిద్ధార్థ అదృశ్యమయ్యారు. మంగళూరులో నేత్రావతి నది వద్ద సోమవారం సాయంత్రం సిద్ధార్థ కనిపించకుండా పోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సిద్ధార్థ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజా ఘటన కర్నాటకలో కలకలం రేకెత్తిస్తోంది.
నేత్రావతి వంతెనపై వెళ్తుండగా..
పోలీసుల కథనం ప్రకారం సిద్ధార్థ మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నేత్రావతి వంతెనపై వెళ్తుండగా డ్రైవర్‌ని కారు పక్కకు నిలపాలని ఆదేశించారు. అలా కారు దిగి వంతెనపై నడుస్తూ సా. 6:30 గంటల వరకు ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నారు. అలా కొద్ది సేపటి తర్వాత ఆయన ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు. ఈ విషయాన్ని వెంటనే సిద్ధార్థ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న దక్షిణ కన్నడ పోలీసులు నదీ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు ప్రారంభించారు.
అదృశ్యానికి ముందుకు సిద్ధార్థ లేఖ
ఇదిలా ఉండగా.. వంతెనపై నుంచి నదిలోకి దూకి ఉంటారనే అనుమానాలు కూడా వెలువడుతున్నాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు....కన్పించకుండాపోవడానికి ముందు సిద్ధార్థ తన కాఫీడే ఉద్యోగులు, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు రాసిన లేఖే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నన్ను క్షమించండి’ అని సిద్ధార్థ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ ఆధారంగా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.