ఢిల్లీ: అమేథి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పోటీ చేస్తోన్న కేంద్ర మంత్రి, బీజేపి మహిళా నేత స్మృతి ఇరాని ఆయనపై మొదటి నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలు 5వ విడత పోలింగ్‌లో భాగంగా ఇవాళ అమేథి లోక్ సభ స్థానానికి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో స్మృతి ఇరాని ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి రాహుల్ గాంధీపై ఆరోపణలు గుప్పించారు. రాహుల్ గాంధీ బూత్ క్యాప్చరింగ్‌కి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాహుల్ గాంధీని తన ట్వీట్‌లో ట్యాగ్ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమేథి లోక్ సభ పరిధిలోని గారిగంజ్‌లో ఏర్పాటు చేసిన 316 పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయడానికి వెళ్లిన ఓ మహిళ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెబుతున్న వీడియో అది. తాను కమలానికి ఓటు వేసేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడున్న అధికారి తన చేతి వేలిని బలవంతంగా హస్తం గుర్తు మీదకు తీసుకెళ్లి ఓటు వేసేలా చేశారని ఆ వీడియోలో వున్న మహిళ ఆరోపిస్తోంది. ఇదే వీడియోను ట్విటర్ ఎన్నికల సంఘానికి ట్యాగ్ చేస్తూ రాహుల్ గాంధీ బూత్ క్యాప్చరింగ్‌కి పాల్పడుతున్నారని స్మృతి ఇరాని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం ఏమని స్పందించనుందో వేచిచూడాల్సిందే మరి.