మూఢనమ్మకాలు ఈ రోజుల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎలా ప్రజల చావుకు కారణమవుతున్నాయో ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బరిషత్ ప్రాంతంలో 63 ఏళ్ల ఓ మహిళ పాములను ఆడించడమే వృత్తిగా చేసుకొని గత ముప్ఫై సంవత్సరాలుగా జీవిస్తోంది. జాతరల్లో ప్రదర్శనలివ్వడం ఆమె పని. అయితే ఆమె తన మూర్ఖత్వం వల్ల ఇటీవలే ప్రాణాలు కోల్పోయింది. జాతరలో ఓ ప్రదర్శన ఇస్తున్నప్పుడు తన చేతిపై పాము కాటువేయగా.. దాని విషం ఆమె నరాల్లోకి ఎక్కింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. తనను ఆ ఊరిలో మంత్రాలతో, మూలికలతో విషాన్ని పోగొట్టే భూతవైద్యుడి వద్దకే తీసుకెళ్లమని కోరింది. ఆమె కుటుంబీకులు ఆమె కోరిన విధంగా తనను ఆ భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. కానీ ఆయన తన మంత్రతంత్రాల ద్వారా, మూలికల ద్వారా వైద్యం చేయలేకపోయాడు. ఇక చేసేదేమీ లేక.. ఆసుపత్రికి తీసుకెళ్లమన్నాడు.


ఆ ఊరికి చాలా దగ్గరలోనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లేసరికే ఆమె పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్లు చాలా ఆలస్యంగా రోగిని తీసుకువచ్చినందుకు ముందు తిట్టినా.. ఆ తర్వాత సాధ్యమైనంత వరకూ ట్రీట్‌మెంట్ చేయడానికి ప్రయత్నించారు. అయినా ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. అయినా ఆ ఊరి జనాలు ఇంకా మంత్రగాడి మీదే గురి కలిగుండడం ఆ ఆసుపత్రిలో డాక్టర్లను విస్తుపోయేలా చేసింది.


మంత్రగాడి వైద్యంలో ఎలాంటి లోపం లేదని.. మరణమనేది దైవాధీనం అన్నట్లు మాట్లాడారు. అయితే మూఢనమ్మకాల వల్ల ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కొందరు యవకుల్లో కదలిక తెచ్చింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భౌతికకాయాన్ని పోస్టు మార్టంకి పంపారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్నందుకు మంత్రగాడిపై కూడా కేసు నమోదు చేశారు. 


చనిపోయిన వృద్ధురాలి పేరు కాళిదాసి మండల్ అని.. ఆమె జాతరలో "మనసమంగల్ కావ్య" అనే జానపద రూపకాన్ని అనేక సంవత్సరాలుగా ప్రదర్శిస్తోందని.. ఆ రూపకంలో పాములతో నాట్యం చేయించడం ప్రత్యేకమని స్థానికులు తెలిపారు. అయితే ఎప్పుడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదని.. ఈ సారి ఆమెను పామును కాటు వేయడం దురదృష్టమని అన్నారు.