జనంపైకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి
రోడ్డు పక్కన ఉన్న జనంపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు.
జంషెద్ పూర్: ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వెస్ట్ సింగ్భూం జిల్లాలోని చక్రధర్పూర్ పరిధిలో చోటుచేసుకున్న రోడ్డుప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. చక్రధర్పూర్ పోలీస్ స్టేషన్‌కు 90 కిలోమీటర్ల దూరంలో, బరోడా వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
'చక్రధర్పూర్ పరిధిలో రోడ్డు పక్కన ఉన్న జనంపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు' అని చక్రధర్పూర్ సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ సకల్దో రామ్ చెప్పారు.
క్షతగాత్రులైన పన్నెండు మందిని చక్రధర్పూర్ సర్దార్ ఆసుపత్రికి, రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు చికిత్స సమయంలో మరణించారని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.