సినిమా థియేటర్లలో చిత్ర ప్రదర్శనకు ముందు జాతీయ గీత ప్రదర్శన కూడా తప్పక జరగాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. అలా గీతాలాపన జరుగుతున్నప్పుడు ప్రేక్షకులు కచ్చితంగా నిలబడాలని, గీతం పాడాలని నియమం లేదని... అలా చేయలేనంత మాత్రాన వారికి దేశభక్తి లేదని మనం ధ్రువీకరించలేమని, ఈ విషయాన్ని మరల ప్రభుత్వం సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 డిసెంబరు 2016 నుండి సినిమా థియేటర్లలో జాతీయ గీత ప్రదర్శనను తప్పనిసరి చేసిన  విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఆ తర్వాత భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది జాతీయ గీత ప్రదర్శన జరుగుతున్నప్పుడు నిలబడని వారిని టార్గెట్ చేసి, దేశద్రోహులుగా ముద్రవేస్తూ.. దూషించిన సందర్భాలు కూడా ఉన్నాయి.


ఈ క్రమంలో ఈ జాతీయ గీత ప్రదర్శన చట్టానికి సంబంధించి స్వల్ప మార్పులను కోర్టు సూచించింది. "ప్రజలు ఎప్పుడూ దేశభక్తిని కప్పుకొని తిరగరు. వారిలో చాలామంది దేశద్రోహులుగా ఇతరులు ముద్రవేస్తారన్న భయంతో లేచి నిలబడుతున్నారు" అని జస్టిస్ చంద్రచూద్ తెలిపారు.


గతంలో శ్యామ్ నారాయణ్ చౌస్కే అనే పౌరుడు, సినిమా థియేటర్లలో జాతీయ గీత ప్రదర్శనను తప్పనిసరి చేయడం మంచిదేనని, కాకపోతే అందుకు తగ్గ నిబంధనలు, ప్రదర్శించే సమయాన్ని కూడా తెలపాలని కోరుతూ కోర్టులో ఫైల్ చేసిన పిల్‌ మీద సమాధానమిస్తూ, కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.