కాంగ్రెస్ నేత శశిథరూర్ పేరును ఢిల్లీ పోలీసులు ఈ రోజు సునంద పుష్కర్ కేసుకి చెందిన ఎఫ్‌ఐఆర్ కాపీలో చేర్చారు. జనవరి 17, 2014 తేదిన సునంద పుష్కర్ అనుమానాస్పదమైన రీతిలో ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 2010 తేదిన థరూర్, సునందను వివాహం చేసుకున్నారు. సునంద మరణించాక శశి థరూర్ పై సెక్షన్ 498 ఏ, 306 సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఛార్జిషీటులో కూడా థరూర్‌తో సునంద పెళ్లి జరిగిన మూడు సంవత్సరాల, మూడు నెలల, 15 రోజుల్లోనే ఆమె మరణించారని పేర్కొన్నారు. అయితే ఆ ఛార్జిషీటుపై శశి థరూర్ స్పందించారు. అందులో వాడిన భాష సరిగ్గా లేదని ఆయన తెలిపారు. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు విషయమై ఎవరి మీదా ఎలాంటి ఆరోపణలూ నిజమని తేలలేదని చెప్పినా.. మళ్లీ ఆరునెలల్లోనే తన పేరును  ఎఫ్‌ఐఆర్ కాపీలో ఎలా చేరుస్తారని ఆయన అన్నారు.


ఇదే విషయంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడారు. "యూపీఏ హయంలో పోలీసులు అమ్ముడైపోయి సాక్ష్యాలు అన్నీ తారుమారు చేశారు" అని ఆరోపించారు. "ప్రస్తుతం జరుగుతున్న ఎంక్వయరీలో భాగంగా చాలా సమాచారం తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. శశి థరూర్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన తన భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించారని కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి" అని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు