ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రక కట్టడం తాజ్ మహల్ తమదేనని సున్నీ వక్ఫ్ బోర్డ్ పిటిషన్ దాఖలు చేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రాధాన్యత లేని పిటిషన్లు దాఖలు చేసి కోర్టు విలువైన సమయం వృధా చేయొద్దని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పిటిషనర్లపై అక్షింతలు వేసింది. '' ఒకవేళ మొఘల్ చక్రవర్తి షాజహాన్ స్వయంగా సంతకం చేసి, రాసి ఇచ్చిన వీలునామా ఏదైనా వుంటే అది తీసుకుని రండి!! అంతేకానీ ఇలా నిరాధారమైన పిటిషన్లతో కోర్టు సమయం వృథా చేయొద్దు '' అని కోర్టు మండిపడింది. 2010లో ఉత్తర్ ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డ్ దాఖలు చేసిన పిటిషన్‌పై భారత పురాతత్వ శాఖ వారు దాఖలు చేసిన అప్పీలు నేడు కోర్టు ఎదుట విచారణకు వచ్చిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దేశంలోని చారిత్రక కట్టడాల నిర్వహణ బాధ్యతను భారత పురాతత్వ శాఖ పర్యవేక్షిస్తున్న సంగతిని సైతం ఈ సందర్భంగా గుర్తు చేసిన కోర్టు.. అసలు తాజ్ మహల్‌పై యాజమాన్య హక్కులని సొంతం చేసుకోవాలనే అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. అంతేకాకుండా తాజ్ మహల్ లాంటి చారిత్రక కట్టడం సున్నీ వక్ఫ్ బోర్డుది అని ఎవరైనా వాదిస్తే, దేశంలో వారి మాటలను ఎవరైనా విశ్వసిస్తారా అని కోర్టు ప్రశ్నించింది. 


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఏ.ఎం. కన్విల్కర్, డీవై చంద్రచుద్‌లు సభ్యులుగా వున్న ధర్మాసనం ఎదుట బుధవారం ఈ అప్పీలు విచారణకు వచ్చింది. తాజ్ మహల్ చుట్టూ ఈ తరహా వివాదాలు చెలరేగడం ఇదేం తొలిసారి కాదు. తాజ్ మహల్ అసలు పేరు తేజో ఆలయం అని సైతం గతంలో హిందూ మహాసభ ప్రకటించడం అప్పట్లో చర్చనియాంశమైన సంగతి తెలిసిందే.