న్యూఢిల్లీ: మహారాష్ట్రలో బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis), ఎన్సీపీ నేత అజిత్ పవార్‌(Ajit Pawar)లు కలిసి కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి(Maharashtra govt) ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి(Bhagat Singh Koshyari) సహాయం చేసి రాజ్యంగం నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్(Sharad Pawar) నేతృత్వంలోని ఎన్సిపిలు సుప్రీం కోర్టులో(Supreme court) రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఈ రిట్ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ వ్యవహారంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విపక్షాలు కోరినట్టుగా ఇప్పటికిప్పుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను(Floor test) ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, బల పరీక్ష ఎప్పడు చేపట్టాలి, ఏంటనే తదితర వివరాలను సోమవారం తామే వెల్లడిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్‌ ఎన్వీ రమణ, అశోక్‌ భూషన్‌, సంజీవ్‌ కన్నాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది. మహారాష్ట్ర సర్కార్ వెంటనే బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదన్న కోర్టు.. తదుపరి విచారణను సోమవారం ఉదయం 10:30 గంటలకు వాయిదా వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : మహారాష్ట్రలో కొత్త ట్విస్ట్.. సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం!


కేంద్ర ప్రభుత్వానికి, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌లకు సుప్రీం కోర్టు నోటీసులు:
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కంటే ముందాగ.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఉందంటూ ఫడ్నవిస్‌ గవర్నర్‌కు సమర్పించిన లేఖను, అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్‌ భగత్ సింగ్ కొశ్యారి బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవిస్‌కు పంపిన లేఖను సోమవారం ఉదయం 10.30 గంటల్లోగా తమకు అందజేయాల్సిందిగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మెహతాను సుప్రీం కోర్టు కోరింది. అంతే కాకుండా మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం చోటుచేసుకున్న తాజా పరిణామాలపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి, దేవేంద్ర ఫడ్నవిస్‌, అజిత్‌ పవార్‌లకు సైతం సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.