న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డిఏ సర్కార్‌పై శివసేన(Shiv Sena) మరోసారి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. మహారాష్ట్రలో(Maharashtra) రైతుల కోసం కేంద్రం ఏమీ చేయలేదని ఆరోపించిన శివసేన.. రాష్ట్రంలో రైతులు కరువుబారిన పడినప్పటికీ కేంద్రం ఆదుకోలేదని మండిపడింది. మరాట్వాడలో రైతులు కరువుతో కష్టాలుపడినా పట్టించుకోని కేంద్రం... కనీసం అకాల వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలమైన తర్వాత కూడా ప్రకృతి విపత్తుగా ప్రకటించలేదని కేంద్రంపై విరుచుకుపడింది. కేంద్రం మహారాష్ట్రలో రైతులను నిర్లక్ష్యం చేయడంతో దిక్కులేని పరిస్థితుల్లో వాళ్లు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారని శివ సేన ఆవేదన వ్యక్తంచేసింది. తమ సొంత పత్రిక సామ్నాలోని సంపాదకీయ కథనం ద్వారా శివ సేన ఈ ఆరోపణలు చేసింది.
Read also : బీజేపిపై సంచలన ఆరోపణలతో విరుచుకుపడిన శివసేన!
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులు.. తమ అప్పులు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని శివసేన ఆరోపించింది. వీలైనంత త్వరగా వారికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సిందిగా శివసేన ఈ కథనం ద్వారా డిమాండ్ చేసింది.