అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూ ఢిల్లీ: అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రక, సంచలనమైన తీర్పు వెల్లడించింది. వివాదంలో ఉన్న అయోధ్య స్థలం తమదేనంటూ ముస్లిం సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు.. ఆ స్థలంలో రామ మందిరం నిర్మించాల్సిందిగా స్పష్టంచేసింది. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మాణం కోసం మూడు నెలల్లో ఓ ట్రస్టును ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, అదే సమయంలో దశాబ్ధాల తరబడిగా కొనసాగుతున్న ఈ కేసులో ముస్లిం సంస్థల పిటిషన్లను కొట్టేసిన కోర్టు.. వారికి ప్రత్యామ్నాయంగా అయోధ్యలోనే మరోచోట 5 ఎకరాల భూమి కేటాయించనున్నట్టు ప్రకటించింది. అయోధ్య స్థలాన్ని మూడు ముక్కలు చేయాలన్న అలహాబాద్ హై కోర్టు తీర్పును తప్పుపట్టిన సుప్రీం కోర్టు.. ఆ స్థలాన్ని విభజించే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.
అక్టోబర్ 16న ఈ కేసులో వాదనలు పూర్తిచేసిన సుప్రీం కోర్టు.. ఆ తర్వాత తీర్పు రిజర్వులో పెట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 8న దీనిపై ఓ ప్రకటన చేసిన సుప్రీం కోర్టు... నవంబర్ 9న తీర్పు ఇవ్వనున్నట్టు స్పష్టంచేసింది. షెడ్యూల్ ప్రకారమే సుప్రీం కోర్టు నేడు ఈ సంచలన తీర్పు వెల్లడించింది.