హైదరాబాద్: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. నిన్న ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో జరిగిన ఘర్షణ.. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. విద్యార్థుల ఆందోళన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపడుతూ పలువురు న్యాయవాదులు సుప్రీం తలుపు తట్టారు. ఈ కేసును సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. ఐతే దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ బోబ్డే... అందుకు నిరాకరించారు. దేశవ్యాప్తంగా తాము శాంతిని కోరుకుంటున్నామని.. ముందు ఆందోళనలు సద్దుమణిగేలా ప్రయత్నించాలని స్పష్టం చేశారు.  పరిస్థితులు అదుపులోకి రాకుండా ఎలాంటి విచారణలు చేయలేమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు సద్దుమణిగితే.. మంగళవారం విచారణకు స్వీకరిస్తామని సీజేఐ స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAA చట్టంపై పిటిషన్లు దాఖలు...  
పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో త్రిపుర మాజీ మహరాజా ప్రద్యోత్‌ కిశోర్‌ దేవ్‌ వర్మన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం డిసెంబర్‌ 18న విచారణ జరపనుంది. మరోవైపు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా పౌరసత్వ సవరణ చట్టంపై పిటిషన్ దాఖలు చేశారు.    


క్యాంపస్‌లోకి వస్తారా..?
జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ నజ్మా అక్తర్.. పోలీసులు క్యాంపస్‌లోకి వచ్చి లాఠీఛార్డ్ చేసిన తీరును తప్పుపట్టారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు యూనివర్శిటీలోకి ప్రవేశించి హంగామా సృష్టించారని.. ఫలితంగా 200 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని  తెలిపారు. ఇద్దరు విద్యార్థులు చనిపోయారన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ఆమె సూచించారు.    


ఢిల్లీ పోలీసుల కౌంటర్..
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వ్యాఖ్యలకు ఢిల్లీ పోలీసులు కౌంటర్ ఇచ్చారు. రౌడీ మూకలను వెంబడిస్తుండగా.. వారు యూనివర్శిటీలోకి ప్రవేశించారని చెప్పారు. దీంతో పోలీసులు వారిని వెంబడించాల్సి వచ్చిందన్నారు. ఈ క్రమంలో యూనివర్శిటీ విద్యార్థులు తమపై రాళ్లు రువ్వారని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలిపారు.  


దేశవ్యాప్త నిరసనలు..
మరోవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ రోజూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. లక్నోలోని నడ్వా కాలేజీ ఎదుట విద్యార్థులు.. జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులకు సంఘీభావంగా ఆందోళన చేశారు. ఐతే పోలీసులు బయట నుంచి గేటుపెట్టి.. విద్యార్థులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.  హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఆందోళనకు దిగారు. జేఎంఐ విద్యార్థులకు మద్దతుగా నినాదాలు చేశారు.  యూనివర్శిటీ గేటుకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీలోనూ ఆదివారం అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది. స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు.    


మమతాగ్రహం..
బీజేపీ వారు ఒక్కరే ఇక్కడ ఉండాలి. మిగతా వాళ్లంతా వెళ్లిపోవాలి. ఇదే వారి రాజకీయం అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఎప్పటికీ జరగదని.. భారత్ అందరిదని స్పష్టం చేశారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటున్న బీజేపీ.. ఎవరూ లేకపోతే ఎవరిని అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం పౌరుల కోసం కాదా ? మనమంతా ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. భారత దేశంలో మనమంతా నివసించడం లేదా అంటూ నిలదీశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో టీఎంసీ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన సీఎం మమతా బెనర్జీ.. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.      


రాజకీయ దుమారం..  
పౌరసత్వ సవరణ చట్టానికి జరుగుతున్న వ్యతిరేక నిరసలపై రాజకీయ దుమారం రేగుతోంది. అనుమతి లేకుండా జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలోకి ఎలా అడుగుపెడతారని కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ ప్రశ్నించారు. దీనిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ  చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నందున ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు కొన్ని రాజకీయ పార్టీలు కావాలని హింసను ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.