ముస్లిములకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సుష్మా స్వరాజ్ పై ట్వీట్స్ వార్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పౌరుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడంలో మంత్రి సుష్మా స్వరాజ్ ఎప్పుడూ ముందుంటారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పౌరుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడంలో మంత్రి సుష్మా స్వరాజ్ ఎప్పుడూ ముందుంటారు. అయితే ఒకప్పుడు సోషల్ మీడియాలో ఆమెను పొగిడిన వారే ఇప్పుడు ఆమెపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సుష్మా స్వరాజ్ చర్యలు ముస్లిములను సమర్థించే విధంగా ఉన్నాయని కొందరు అంటున్నారు.
ఇటీవలే నోయిడాలో ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఓ హిందు మహిళతో పాటు ఆమె భర్త పట్ల అనుచితంగా ప్రవర్తించిన పాస్ పోర్టు అధికారిని సుష్మ బదిలీ చేయమని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగాక.. పలువురు మంత్రిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలువురు ట్వీట్స్ కూడా చేస్తూ.. మంత్రి సుష్మా స్వరాజ్‌ను అసహనానికి గురి చేస్తున్న క్రమంలో ఆమె ఓ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు.
తనపై వస్తున్న విమర్శలను ఎదుర్కొవడానికి మంత్రి ప్రజల మద్దతు కోరారు. ఈ క్రమంలో ఆమె ఒక ట్వీట్ చేశారు. "స్నేహితులారా.. గత కొంతకాలంగా నాపై ట్విట్టర్‌లో విమర్శలు వస్తున్నాయి. కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి ట్వీట్లను మీరు సమర్థిస్తారా" అని సుష్మా స్వరాజ్ ట్విటర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టు వైరల్ అయ్యాక.. సుష్మా స్వరాజ్ కు మద్దతుగా నిలిచారు. దాదాపు 59 శాతం మంది ఆమెకు మద్దతిచ్చారు. అలాగే, 41 శాతం మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశారు.