మాజీ క్రికెటర్ సిద్ధూపై సుష్మా సీరియస్
మాజీ క్రికెటర్ సిద్దూకి చీవాట్లు పెట్టిన సుష్మా స్వరాజ్
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూపై.. కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సీరియస్ అయ్యారు. ఇటీవల పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాణ స్వీకారోత్సవ కార్యాక్రమానికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా వెళ్లారు. దీంతో సిద్దూను సుష్మా మందలించినట్లు కేంద్రమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత హర్‌సిమ్రత్ కౌర్ తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యాక్రమానికి వెళ్లిన సిద్దూ.. అక్కడ పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం, కర్తార్‌పుర్ సాహెబ్ కారిడార్ అంశాన్ని లేవనెత్తడం పట్ల కూడా సుష్మా సీరియస్ అయినట్లు మంత్రి హర్‌సిమ్రత్ ట్వీట్‌లో తెలిపారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కూడా సిద్దూ పాక్ ఆర్మీ చీఫ్‌ని ఆలింగనం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
కానీ సిద్దూ మాత్రం.. కర్తార్‌పుర్ కారిడార్‌ని ప్రజల కోసం తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఆయన సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ కారిడార్‌ను తెరవడం వల్ల సిక్కులకు ప్రయోజనం కలుగుతుందని, రెండు దేశాల మధ్య శాంతి వర్థిల్లుతుందని సుష్మాకు రాసిన లేఖలో ప్రస్తావించారు.