తాజ్ మహల్.. ఏడు ప్రపంచ వింతల్లో ఒక్కటైన ఓ అద్భుత కట్టడం. ఈ మహా సౌందర్య కట్టడాన్ని చూడడానికి దేశ, విదేశాల నుండీ కూడా ఎందరో యాత్రికులు వస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో నిర్మితమైన ఈ గొప్ప కట్టడానికి, ఆ రాష్ట్ర పర్యాటక బుక్‌లెట్‌లోనే స్థానం దొరకకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలే యూపీ రాష్ట్ర విశేషాలతో కూడిన పర్యాటక సంచికను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రితా బహుగుణ వెలువరించారు. అందులో గోరఖ్ పూర్ లాంటి ప్రాంతాల విశేషాలతో పాటు అనేక ఇతర ప్రాంతాల వివరాలు ఉండగా, తాజ్‌మహల్ గురించి ప్రస్తావనే లేకపోవడం పలువురిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఈ వార్త మీడియాలో బాగా వైరల్ అయ్యాక. యూపీ పర్యాటక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.  అందులో రాష్ట్రం పర్యాటక వికాసం కోసం అనేక స్కీములతో ముందుకు వస్తుందని, అందులో దాదాపు 370 కోట్ల విలువ గల ప్రతిపాదనలు ఉన్నాయని, తాజ్ మహల్ చుట్టు ప్రక్కల ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం 156 కోట్లు ఖర్చు పెడుతున్నామని పేర్కొంది. అయితే అసలు రాష్ట్ర పర్యాటక బుక్‌లెట్‌లో  తాజ్‌మహల్‌కు ఎందుకు చోటు కల్పించలేదు అన్న విషయంపై విమర్శలు మాత్రం ఇంకా వస్తున్నాయి.