మహిళా విలేకరి పట్ల తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్ ప్రవర్తించిన తీరుపై పెద్ద దుమారం రేగడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. మనువరాలి వయస్సులో ఉన్న ఆమెను అభినందించేందుకే ఆమె చెంపను తాకానన్నారు. తన చర్య వల్ల ఆ మహిళా విలేకరి ఇబ్బందికి గురికావడం వల్ల ఆమెకు క్షమాపణ చెబుతున్నానని, తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని  ఓ ప్రకటనలో తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గవర్నర్ బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ ఆరోపించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ ప్రొఫెసర్‌ ఎవరో కూడా తెలియదంటూ బన్వరిలాల్‌ పేర్కొన్నారు. సమావేశం ముగిసి వెళ్ళిపోతున్న సమయంలో ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పకుండా ఆమె చెంపను తాకారు. గవర్నర్‌ చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. తన పట్ల గవర్నర్‌ ప్రవర్తించిన తీరుపై  ఆ మహిళా విలేకరి ట్విటర్‌లో స్పందించారు.


అంతకు ముందు ఆ మహిళా విలేకరి ట్విట్టర్‌లో ‘విలేకరుల సమావేశంలో తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సంఘటనపై విపక్ష డీఎంకే నిప్పులు చెరిగింది. గవర్నర్ చర్యను ఖండించింది. ఉద్దేశం ఏదైనా కావచ్చని, ఓ యువతి/మహిళ గౌరవానికి భంగం కలిగించడం మాత్రం సభ్యత అనిపించుకోదని ఎంపీ కనిమొళి ట్వీట్‌ చేశారు.