తెలంగాణ గవర్నర్‌గా తనను నియమించడంపై స్పందించిన తమిళనాడు బీజేపి చీఫ్ డా తమిళిసై సౌందరరాజన్.. తనకు ఆ అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓ సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన తనకు ఇవాళ ఓ గౌరవప్రదమైన స్థానం దక్కిందని అన్నారామె. దేశానికి సేవ చేసేందుకు ఇది ఓ చక్కటి అవకాశంగా భావిస్తానని సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన అనంతరం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ సౌందరరాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.


కేంద్రం నేడు ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించగా ఆ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో తెలంగాణ గవర్నర్‌గా సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, కేరళ గవర్నర్‌గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్ సింగ్ కోష్యారి ఉన్నారు. ఇక ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న కల్‌రాజ్ మిశ్రాను రాజస్థాన్ గవర్నర్‌గా బదిలీ చేసిన సంగతి తెలిసిందే.