జెట్ ఎయిర్ వేస్ కొనుగోలుపై టాటా సన్స్ ఆసక్తి ?
జెట్ ఎయిర్‌వేస్ ను నష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇంధన ధరల పెరుగుదలతో పాటు రూపాయి మారకపు విలువ క్షీణత, టికెట్ ధరలు తక్కువగా ఉండడం, అలాగే విమానయానం రంగంలో బాగా పోటీ ఎక్కువ కావడం, అధిక ఇంధన పన్ను వల్ల జెట్ ఎయిర్ వేస్ బాగా నష్టాల్లోకి వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ సంబంధించి తాజా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. భారత్ కు చెందిన టాటా సన్స్ కంపెనీ జెట్ ఎయిర్ వేస్ కొనుగోలుపై శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. జెట్ ఎయిర్ వేస్ ను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ యోచిస్తోందని మింట్ వార్తాపత్రిక ప్రకటించింది. ఇందుకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌరభ్ అగర్వాల్ జెట్ ఎయిర్ వేస్ చైర్మన్ నరేష్ గోయల్ తో ఈ విషయంపై చర్చింనట్లు తెలుస్తోంది.
వరుసగా మూడో త్రైమాసికంలోనూ జెట్ ఎయిర్‌వేస్ ను నష్టాలు వెంటాడుతున్నాయి. సోమవారం మూడో త్రైమాసికానికి సంబంధించిన నష్టాన్ని కూడా జెట్ ఎయిర్ వేస్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం లాభాలు ఆర్జించడంపైనే జెట్ ఎయిర్ వేస్ దృష్టి సారించింది. తక్కువ లాభాలు వచ్చే మార్గాల్లో విమానాలను తగ్గించాలని జెట్ ఎయిర్ వేస్ నిర్ణయం తీసుకుంది.