న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల తీరు చూస్తోంటే.. ఇవి శీతాకాల సమావేశాలా లేక నిరసనల సమావేశాలా అన్నట్టుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటికిమొన్న లోక్ సభలో సమావేశాలు సజావుగా సాగకుండా ఆందోళనలు చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్.. ''మీకన్నా చిన్నపిల్లలే నయం.. చెబితే వింటారు'' అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటిలాగే, నేడు కూడా నిరసనల పర్వం మధ్యే పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


పార్లమెంట్ లోపల రఫేల్ డీల్‌పై సుప్రీం కోర్టు తీర్పు అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య రభస జరుగుతోంటే, పార్లమెంట్ వెలుపల వివిధ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు, వివిధ అంశాలపై తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు. పార్లమెంట్ బయట జరుగుతున్న నిరసనల విషయానికొస్తే, పార్లమెంట్ బ్రేక్ విరామం సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టీడీపీ, వైఎస్సార్సీపీ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వేర్వేరుగా పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదానే రాష్ట్రాభివృద్ధికి కీలకం అని చెబుతూ వస్తోన్న ఆయా పార్టీల ఎంపీలు.. ఆ దిశగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.


 



 


ఇదిలావుంటే, మరోవైపు తమిళనాడులోని అధికార పార్టీ అయిన ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు సైతం పార్లమెంట్ ఎదుట నిరసనకు దిగారు. కావేరి నదిపై కర్ణాటక సర్కార్ డ్యామ్ నిర్మాణం చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏఐఏడీఎంకే పార్టీ ఎంపీలు నిరసన వ్యక్తంచేశారు. కావేరి నదిపై కర్ణాటకలో మరో డ్యామ్ నిర్మాణం జరిగితే ఆ తర్వాత తమిళనాడుకు మరింత నీటి ఎద్దటి ఏర్పడుతుందని తమిళనాడు సర్కార్ ఆవేదన వ్యక్తంచేస్తోంది.


 



 


రాజ్యసభలోనూ వివిధ అంశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య నిరసనలకు దారితీస్తున్నాయి.