కొందరు నిరుపేద యువకులు, ఖరీదైన జీవితాన్ని గడపడం కోసం ఒక ముఠాగా ఏర్పడ్డారు. అందుకోసం ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఈ క్రమంలో ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. టాక్సీ డ్రైవర్లను టార్గెట్ చేసి.. వారి వాహనాలు కాజేసి అమ్మేయాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం తమ తొలి పథకంగా ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కడ నుండే ఓలా యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేశారు. అయితే క్యాబ్ ఎక్కగానే బుకింగ్ క్యాన్సిల్ చేసేసి తమ వద్ద ఉన్న నాటు తుపాకులతో డ్రైవరును బెదిరించి, సోనిపట్ ప్రాంతంలోని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ డ్రైవరుని గొంతుపిసికి చంపేసి.. అదే క్యాబ్‌లో మళ్లీ నగరానికి వచ్చి వాహన రూపురేఖలు మార్చి అమ్మేయాలని భావించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఢిల్లీ పోలీసులు చాలా చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు.


నిర్మానుష్యమైన ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి శవం కనిపించడంతో తొలుత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా చనిపోయిన వ్యక్తి ఓలా క్యాబ్ డ్రైవరు అనే విషయాన్ని కనుగొన్నారు. ఆయన వివరాలు సేకరించి... ఆయన నెంబరు కాల్ డేటాతో పాటు... ఆయన నెంబరుకు ఏ నెంబరు నుండి బుకింగ్ వచ్చింది మొదలైన వివరాలన్నీ సేకరించాక కేసు ఒక కొలిక్కి వచ్చింది.


ముందు అనుమానితులుగా భావించి నిందితులను అరెస్టు చేసినా.. ఆ తర్వాత వారు ఖరీదైన బట్టలు కొనుక్కోవడానికి, విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఈ మర్డర్ చేశామని చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. ఈ మర్డర్ చేసిన యువకులందరూ దాదాపు 25 సంవత్సరాల లోపువారే. ఓలా క్యాబ్ డ్రైవర్ చనిపోవడంతో.. ఢిల్లీలోని క్యాబ్ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కమీషనరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు