తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రోజు కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరారు. మరో రెండు గంటల్లో ఆయన కర్ణాటక చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పార్లమెంటరీ నేత కేశవరావు, శాసనసభ్యులు వినోద్‌ మొదలైనవారితో కూడిన బృందంతో కేసీఆర్ ఓ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన జనతాదళ్‌ (లౌకిక) పార్టీ జాతీయాధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడతో పాటు జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామితో కూడా భేటీ అవుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో వారు కొన్ని ముఖ్యమైన రాజకీయ సమస్యలపై చర్చించనున్నారు. ప్రథమంగా కేసీఆర్ ప్రతిపాదించిన నూతన రాజకీయ కూటమి లాంటి అంశాలు ఈ భేటీలో తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే కేసీఆర్ ఇదే అంశంపై చర్చించేందుకు బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలిశారు.అలాగే ఝూర్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ హైదరాబాద్ వచ్చినప్పుడు మాట్లాడారు.


తాజాగా కర్ణాటకలో ఎన్నికల హడావుడి జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉంటున్న జనతాదళ్‌ నేతలతో పాటు అపార అనుభవం కలిగిన దేవెగౌడతో కలిసి మాట్లాడాలని.. తద్వారా సరికొత్త రాజకీయ మార్పులకు నాంది పలికే విధంగా కేసీఆర్ యోచిస్తు్న్నారని పలువురి అభిప్రాయం. ఈ క్రమంలో ఆయన తన కర్ణాటక పర్యటనను గురించి దేవెగౌడకి ముందుగానే సమాచారం అందించారు.


అలాగే రిజర్వేషన్ల పెంపుదల బిల్లుకు సంబంధించి మోదీ సర్కారుపై ఒత్తిడి తెచ్చే పనిలో జేడీఎస్‌ సహకారం కూడా ఆయన కోరనున్నారు.ఈ సమావేశం తర్వాత దక్షిణ భారత రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతలు అయినటు వంటి కేసీఆర్, దేవెగౌడలు మీడియా సమావేశంలో కూడా పాల్గొనే అవకాశం ఉంది.