ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం మహా జాతర శనివారం రాత్రి ముగిసింది. ప్రతీ రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరలో, సంప్రదాయం ప్రకారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను చివరిగా వన ప్రవేశం చేయించడం ఆనవాయితీ. గిరిజన జాతర సంప్రదాయం ప్రకారమే పూజారులు సమ్మక్కను చిలకలగుట్ట, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు తీసుకెళ్లారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డప్పు, వాయిద్యాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య సారలమ్మ రాకతో జనవరి 31న ప్రారంభమైన మేడారం మహా జాతరలో ఎన్నో ఆసక్తికరమైన, అపురూపమైన ఘట్టాలని సంప్రదాయం ప్రకారం పూర్తిచేశారు. ఈ ఏడాది దాదాపుగా 1.20 కోట్ల మంది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారని సంబంధిత అధికారవర్గాలు తెలిపాయి. 


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, కర్ణాటక, ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఈ జాతరకు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, చత్తీస్‌ఘడ్ సీఎం రమణ్ సింగ్ వంటి ప్రముఖులు మేడారం జాతరలో అమ్మవార్లను దర్శించుకుని బంగారాన్ని మొక్కుబడిగా సమర్పించుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర డిప్యుటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. 


మేడారం వద్ద ప్రవహించే జంపన్న వాగులో పవిత్ర స్నానం ఆచరించి, ఇక్కడ అమ్మవార్లని దర్శించుకునే భక్తులు తమ ఎత్తు తూకం వున్న బెళ్లాన్ని అమ్మవార్లకు ప్రసాదంగా సమర్పించుకోవడం ఆనవాయితీ. ఈ ప్రసాదాన్నే భక్తులు బంగారంగా భావిస్తారు.. బంగారం అనే పేరుతోనే పిలుస్తారు.