నవంబరు 26, 2008. ఈ రోజు ముంబయి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 10 మంది పాకిస్తాన్ తీవ్రవాదులు ముంబయి నగరంలోకి అడుగుపెట్టి ప్రజలకు అరాచకమంటే ఏమిటో చూపించిన వైనమిది. ఈ ఉగ్ర దాడుల్లో 166 మంది  పౌరులు మరణించగా.. 300 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన జరిగి 10 ఏళ్లు అవుతున్న క్రమంలో ముంబయి పోలీస్ కమీషనర్ సుభోద్ కుమార్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడారు. ఆ రోజుకీ, ఈ రోజుకీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని.. పోలీసులకు కూడా అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని.. ఒక రకంగా చూసుకుంటే ఈ రోజు ముంబయికి రక్షణ కవచంలా పోలీసులు పనిచేస్తూ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూస్తున్నారని తెలిపారు. ఆయుధాల విషయంలో గానీ, లేటెస్ట్ ఎక్విప్ మెంట్ విషయంలో గానీ నేడు ముంబయి పోలీసులకు కొదువ లేదని ఆయన పేర్కొన్నారు. కోస్టల్ పోలీస్ వారి విజిలెన్స్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటున్నాయని ఆయన తెలిపారు. 


ఈ క్రమంలో దేవన్ భారతీ, ముంబయి జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) మాట్లాడుతూ, తాము కోస్టల్ బలాన్ని పెంపొందించుకోవడానికి కొత్త బోట్లతో పాటు సహాయక పనిముట్లు, అధునాతన సాంకేతిక పరికరాలను సమకూర్చుకున్నామని.. ఇంకా మెరుగైన పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ కూడా పంపామని తెలిపారు. ఇప్పటికే పోలీసులు కోస్టల్ ప్రాంతంలో స్పీడు బోట్లు, హోవర్ క్రాఫ్టులు ఉపయోగిస్తు్న్నారని ఆయన తెలిపారు.  ముంబయిపై 2008లో దాడులు జరిగాక.. కోస్టల్ పెట్రోలింగ్ వ్యవస్థ మెరుగుపడిందని ఆయన అన్నారు. ఈ ఘటన జరిగి 10 సంవత్సరాలు అవుతున్న క్రమంలో.. అదే ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా మిగిలిన పలువురు వ్యక్తులు కూడా మీడియాతో మాట్లాడారు. 


ఆ దాడులు జరిగినప్పుడు తాజ్ హోటల్‌లో ఉన్న మాజీ బీఎస్పీ ఎంపీ లల్మనీ ప్రసాద్ మాట్లాడుతూ "నా కళ్ల ముందే జరుగుతున్న విధ్వంసాన్ని చూసి నా నోట మాట రాలేదు. నన్ను కలవడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులను కూడా టెర్రిరిస్టులు చంపేశారు. నేను అప్పుడు రెండవ ఫ్లోరులో ఉన్నాను. సెక్యూరిటీ అధికారులకు, టెర్రరిస్టులకు మధ్య జరిగిన కాల్పులను ప్రత్యక్షంగా చూశాను. అదే హోటల్‌లో 48 గంటలు నేను ఎవరికీ తెలియకుండా తలదాచుకున్నాను. నవంబరు 26 నుండి 28 వరకు అక్కడే ఉన్న నన్ను ఆఖరికి ఎన్ఎస్జీ కమెండోలు రక్షించారు. ఆ మూడు రోజులు నా మొబైల్ ఫోన్‌కి ఇంటి నుండి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ రోజు మీ ముందు ఇలా మాట్లాడుతానని కూడా నేను ఆ రోజు అనుకోలేదు"


ఇదే దాడిలో చనిపోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ తండ్రి ఈ దాడులు జరిగి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు. "మా అబ్బాయికి విన్నింగ్ యాటిట్యూడ్ ఎక్కువ. ఆ యాటిట్యూడ్ వల్లే క్రికెట్‌లో సచిన్ అంటే ఎంతో ఇష్టపడేవాడు. జట్టు విషమ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్నీ తన భుజాన వేసుకొని పోరాడడం తన నైజం. ఆ రోజు కూడా తీవ్రవాదులను మట్టుబెట్టడానికి లోపలికి వెళ్లిన నా కొడుకు తన సహచరులకు ఒక మెసేజ్ పంపాడు. "మీరు ఎవరూ రానవసరం లేదు. నేను హ్యాండిల్ చేస్తాను" అన్నది దాని సారాంశం. అలాగే తను నాతో ఎప్పుడూ ఓ విషయం చెప్పేవాడు. శత్రువు చేతిలో ఆయుధం ఉండి తమలో ఎవరినైనా చంపాల్సి వస్తే.. తానే తొలి అడుగు వేస్తాడని... ఎందుకంటే తన స్నేహితులు చనిపోతే.. వారి తల్లులు పడే ఆవేదనను తను చూడలేడని సందీప్ అనేవాడు. అందుకేనేమో.. ఆ సమయంలో కూడా తానే ముందుగా వెళ్లాడు" అని చాలా ఉద్వేగంగా తెలిపారు
మేజర్ సందీప్ తండ్రి. తాజ్ హోటల్‌లో టెర్రరిస్టులను మట్టుబెట్టడానికి వెళ్లిన టీమ్‌ను మేజర్ సందీప్ దగ్గరుండి నడిపించాడు. టెర్రరిస్టుల చేతిలో మరణించిన ఆయనకు భారత ప్రభుత్వం 26 జనవరి, 2009 తేదిన అశోక చక్రను ప్రకటించింది. 


ఈ సంఘటన జరిగిన రోజునే టెర్రరిస్టులు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ప్రాంతంలోకి కూడా చొచ్చుకొచ్చారు. రైల్వే స్టేషనులో కాల్పులు జరిపారు. ఆ సందర్భంలో అక్కడ రైల్వే అనౌన్సరుగా పనిచేస్తున్న వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వందల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఆ సంఘటన తలుచుకుంటూ సదరు రైల్వే అనౌన్సర్ ఈ రోజు ముంబయి దాడుల గురించి మాట్లాడారు. "ఆ రోజు నేను కసబ్‌ను దగ్గరుండి చూశాను. ఆ వ్యక్తి కళ్లలో క్రోధాన్ని కూడా చూశాను. అందరినీ దూషిస్తూ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నేను అనౌన్సర్ స్థానం నుండి కదలకుండా కూర్చున్నాను. ఆయన చూపులు మా మీద పడ్డాయి. కంట్రోల్ రూమ్ దాటి రావాల్సిందిగా కళ్లతోనే హుకుం జారీచేశాడు. కానీ మేం రాలేదు. అంతలోనే ఆయన చూపు మళ్లీ కాల్పుల మీద పడింది. కసబ్ కాల్పులు పూర్తయిన తర్వాత ఎవరూ కనిపించకపోతే.. ప్లాట్ ఫారమ్ బయట పడుకున్న కుక్కను కూడా
వదల్లేదు. దానిని కూడా భయంకరంగా కాల్చి చంపాడు." అని ఆయన తెలిపాడు. ఈ దాడుల్లో కమెండోలు 9 మంది టెర్రరిస్టులను కాల్చి చంపి.. ఆఖరి వాడైన కసబ్‌ను ప్రాణాలతో ఆధీనంలోకి తీసుకున్నారు. ఇంత దారుణమైన ఘటనకు  కారణమైన కసబ్‌ను భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు నవంబరు 21, 2012 తేదిన పూణెలోని ఎరవాడ జైలులో ఉరి తీయడం జరిగింది. 


ఇదే దాడుల్లో బలైన మరో ప్రాంతం మంబయిలోని లియోపాల్డ్ కేఫ్ ప్రాంతం. శాంతారామ్ లాంటివారే తమ పుస్తకాల్లో ఈ కేఫ్ గురించి తెలపడం జరిగింది. ఉగ్రవాదులు ఈ కేఫ్ వద్దకు కూడా వచ్చి నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. దాదాపు ఎనిమిది మంది, ఇద్దరు కేఫ్ స్టాఫ్ ఈ కాల్పులలో చనిపోయారు. అయితే ఇటీవలే మీడియా ఈ కేఫ్ నడుపుతున్న ఫరాంగ్, ఫర్జాద్‌లను సంప్రదించగా.. వారు ఈ ఘటనపై ఏమీ మాట్లాడలేమని తెలిపారు. ఆ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత యధావిధిగా కేఫ్ నడిచిందని వారు తెలిపారు.


అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఘటన జరుగుతున్నప్పుడు.. కసబ్ ఫోటో తీసిన ప్రముఖ ఫోటో జర్నలిస్టు సెబాస్టియన్ డిసౌజా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన తీసిన ఫోటోలే ఆ తర్వాత కీలక ఆధారాలుగా మారాయి. ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషనులో రెండు పోలీస్ బెటాలియన్లు ఉన్నా.. వారు కసబ్‌ను ఏమీ చేయలేకపోయారని ఆవేదనతో తెలిపారు. వారు కనుక కసబ్‌ను కాల్చివేసుంటే పరిస్థితి వేరేలా ఉండేదని అన్నారు. అక్కడ పోలీసులకు కూడా తమ ప్రాణాలే ముఖ్యమనే ధోరణిలో పరుగులు పెట్టారని డిసౌజా అభిప్రాయపడ్డారు. అంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా జర్నలిస్టుగా తన బాధ్యతను గుర్తెరిగి ఫోటోలు తీసిన సెబాస్టియన్ (సాబీ)ని వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డు వరించింది.