2జీ కుంభకోణం కేసులో.. అందరూ నిర్దోషులే
సంచలనాత్మక 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో దోషులుగా ఉన్న అందరినీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.
సంచలనాత్మక 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో దోషులుగా ఉన్న అందరినీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ముఖ్యంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. సరైన ఆధారాలు లేకపోవడం వలనే వారిని నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అయితే ఈ కేసులో ఇంకా చాలా కోణాలు ఉన్నాయని.. సీబీఐ ఆధారాలు లేకపోవడం వల్లే పై పేర్కొన్న వ్యక్తులను నిర్దోషులుగా తేల్చిందని.. తాము తదుపరి దర్యాప్తు చేసి హైకోర్టులో అప్పీలు చేస్తామని ఈ కేసు దర్యాప్తును చేపట్టిన పోలీసు వర్గాలు తెలియజేశాయి.
కాంగ్రెస్ హయంలో దేశాన్ని మొత్తాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో దాదాపు 1.76లక్షల కోట్లు చేతులు మారినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై అప్పటి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) అధికారులు స్పందిస్తూ.. పలువురు మంత్రులు కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములయ్యారని
తెలపడంతో.. 2010లో అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజాను పదవి నుండి ప్రభుత్వం తప్పించింది.
ఆ తర్వాత డీఎంకే ముఖ్యనేతలు కనిమొళి సహా 17 మందిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ప్రస్తుతం ఇదే కేసు విషయమై తీర్పు డీఎంకే పార్టీకి అనుకూలంగా రావడంతో పాటు, అందరినీ నిర్దోషులుగా తేల్చడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ..2జీ కేసులో అసత్య ఆరోపణలు చేసిన కాగ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.