కరోనా వైరస్ . . ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడా వణికిపోతున్నాయి. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ .. క్రమ కమంగా మిగతా దేశాలకు వ్యాపిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా.. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నా. . చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియాలో అగ్రరాజ్యం చైనాను కరోనా వైరస్ నిద్రపోనివ్వడం లేదు. ఇప్పటికే 361 మంది ప్రాణాలను మింగేసింది. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో కనిపించే ఈ వైరస్ . . అతి కొద్ది రోజుల్లోనే రోగి ప్రాణాలు తీసేస్తోంది. చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ ప్రభావం విపరీతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే అక్కడ మరణ మృదంగం మోగుతోంది. అక్కడ ఉన్న భారతీయులను ఇప్పటికే రెండు విమానాల ద్వారా స్వదేశానికి తరలించారు. అక్కడి నుంచి వచ్చిన వారికి ఐటీబీపీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు దఫాలుగా వచ్చిన దాదాపు 650 మంది భారతీయులను వైద్య పరిశీలనలో ఉంచారు. వారికి కరోనా వైరస్ లేదని నిర్దారించుకున్న తర్వాత వారందరినీ స్వస్థలాలకు తరలిస్తారు. 


మరోవైపు కరోనా వైరస్ .. ఇప్పటికే భారత దేశంలోకి ప్రవేశించింది. కేరళలోనే రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు కూడా నమోదు కావడంతో .. కేరళలో ఉద్రిక్త వాతావరణం ఉంది. కేరళలోని కసర్‌గడ్ ఆస్పత్రిలో ఓ వ్యక్తి జలుబు, దగ్గు లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. ఐతే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్ సోకిందని నిర్ధారితమైంది. దీంతో భారత్‌లో మూడో కేసు నమోదైనట్లుగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఐతే అతనికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నామని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కే.కే. శైలజ ప్రకటించారు. ప్రస్తుతం అతని పరిస్థితి సాధారణంగా ఉందని తెలిపారు. అతను కొద్ది రోజుల క్రితమే చైనాలోని వుహాన్ నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.