థర్డ్(పెడరల్) ఫ్రంట్‌ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలి అడుగు వేశారు. నేడు ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్‌..ఆ దిశగా ముందడుగు వేశారు. నేడు టీఎంసీ అధినేత్రి మమతతో సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. దేశంలోనే మమత బలమైన మహిళా నేత కావడం, బీజేపీని వ్యతిరేకించడంలో ఆమె అందరికంటే ముందుండటంతో ఫ్రంట్ ఏర్పాటుపై దీదీతో కేసీఆర్ పలు విషయాలు పంచుకోనున్నారు. దేశ రాజకీయాల్లో రావాల్సిన గుణాత్మకమైన మార్పు తదితర అంశాలపై మమతతో చర్చించనున్నారు. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరై.. అనంతరం కోల్కతాకి బయల్దేరి వెళ్లనున్నారు.


కేసీఆర్ వెంట తెరాస సీనియర్ నేతలు కే.కేశవరావు, జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మతో పాటు మరో ముగ్గురు ఐఏఎస్ లు కోల్కతాకి వెళ్లనున్నారు. ఫ్రంట్‌ ఏర్పాటు ప్రకటన తర్వాత కేసీఆర్‌ పాల్గొంటున్న తొలి భేటీ కావడంతో రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతానని ప్రకటించగానే తొలుత స్పందించింది మమతనే.