ఢిల్లీలో పిజ్జా ఆర్డర్ల పేరుతో.. దొంగతనాలు చేస్తున్న ప్రబుద్ధులు
ఢిల్లీలో ఈ మధ్యకాలంలో ఓ గ్యాంగ్ కొత్త రకం దొంగతనాలకు పాల్పడుతోంది. పథకం ప్రకారం పిజ్జాలను ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. వాటిని పట్టుకొచ్చే డెలివరీ బాయ్స్‌పై దాడులకు పాల్పడడానికి శ్రీకారం చుట్టింది ఓ ముఠా.
ఢిల్లీలో ఈ మధ్యకాలంలో ఓ గ్యాంగ్ కొత్త రకం దొంగతనాలకు పాల్పడుతోంది. పథకం ప్రకారం పిజ్జాలను ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. వాటిని పట్టుకొచ్చే డెలివరీ బాయ్స్‌పై దాడులకు పాల్పడడానికి శ్రీకారం చుట్టింది ఓ ముఠా. వివరాల్లోకి వెళితే.. జోమోటో యాప్ ద్వారా తొలుత ఈ గ్యాంగ్ సభ్యుడొకరు నకిలీ ఫోన్ నెంబరుతో పిజ్జా ఆర్డర్ చేసి.. తప్పుడు అడ్రస్ ఇవ్వడం జరిగింది . ఆ తప్పుడు అడ్రసుకి వచ్చిన పిజ్జా డెలివరీ బాయ్ పై ఒక్కసారిగా ముగ్గురు గ్యాంగ్ సభ్యులు దాడికి పాల్పడి అతడు తెచ్చిన పిజ్జాలతో పాటు డబ్బులు, మొబైల్ ఫోన్స్, టూ వీలర్స్ తస్కరించారు.
తర్వాత అదే పిజ్జా డెలివరీ బాయ్ మొబైల్ ఫోన్ ద్వారా వేరే ప్రాంతంలో మరో పిజ్జా షాపుకి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేశారు. ఈ సారి కూడా డెలివరీ చేసే బాయ్‌కి తప్పుడు అడ్రస్ ఇచ్చారు. తొలుత చేసిన విధంగానే ఈసారి కూడా వారు చేయడం జరిగింది. గత రెండు రోజుల్లో వీరు మూడు సార్లు, మూడు వేరు వేరు ప్రాంతాలలో ఇలా దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ గ్యాంగ్ ఇచ్చే అడ్రసులు కూడా నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉండడం... పెద్దగా జన సంచారం లేని ప్రాంతాల్లో ఉండడంతో దాడికి గురైన డెలివరీ బాయ్స్ ద్వారా పిజ్జా షాపులకు సమాచారం రావడం చాలా ఆలస్యమయ్యేది.
అయితే పిజ్జా షాపు ఓనర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. ఓ పథకం ప్రకారం ఈ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. అనుమానాస్పద ప్రాంతాల నుండి వచ్చే ఆర్డర్లను ట్రాక్ చేసి.. డెలివరీ చేసే పిజ్జా బాయ్‌తో పాటు వేరే బైక్స్ మీద పోలీసులు కూడా మఫ్టీలో వెళ్లినప్పుడు గ్యాంగ్ చేసే దాడులను ప్రత్యక్షంగా చూశారు. వెంటనే వారిని అనుసరించి.. నిఘా వ్యవస్థను పటిష్టం చేసి.. శ్రీనివాసపూరి ప్రాంతంతో ఓ గ్యాంగ్ సభ్యుడిని పట్టుకున్నారు. వాడి ద్వారా మిగతా ఇద్దరు సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఈ పిజ్జా ఆర్డర్ల పేరుతో దొంగతనాలు చేస్తున్న గ్యాంగ్‌కు నడుపుతున్న వ్యక్తి గతంలో కూడా ఓ కారు దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడి తండ్రి అమెరికాలో ఉంటాడని.. ఆయన కుటుంబాన్ని వదిలివేయడంతో తల్లిని డబ్బులు కోసం ప్రతీ రోజూ వేధించేవాడని.. ఈ క్రమంలో ఆమె తన సొంత కొడుకుపైనే కేసు పెట్టిందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఆ కుర్రాడికి కౌన్సిలింగ్ చేసి పంపించారని.. కొన్నాళ్లు జైలులో పెట్టారని కూడా సమాచారం. జైలు నుండి వచ్చాక డ్రగ్స్‌కి బానిసైన సదరు వ్యక్తి.. ఈసారి తన మిత్రులతో కలిసి పిజ్జా డెలివరీ బాయ్స్‌ను టార్గెట్ చేసి డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించడం గమనార్హం.