ఒకేసారి మూడు ఎన్‌కౌంటర్లు.. భీకర స్థాయిలో కాల్పులు
తుపాకుల మోతతో దద్దరిల్లుతున్న కాశ్మీర్ లోయ
జమ్మూకాశ్మీర్ తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. కాశ్మీర్‌లో గురువారం తెల్లవారుజాము నుంచే మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కొన్ని గంటలపాటు భీకర కాల్పులు కొనసాగాయి. శ్రీనగర్ శివార్లలోని నూర్ బాగ్, అనంత్‌నాగ్ జిల్లా, బుద్గాం జిల్లాల్లో ఈ మూడు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఏఎన్ఐ తెలిపిన వివరాల ప్రకారం నూర్ బాగ్ ప్రాంతంలో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకుని ఉండి ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం నూర్ బాగ్‌లో కాల్పులు ఆపేసిన భద్రతా బలగాలు.. అక్కడ తలదాచుకున్న ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. అనంత్‌నాగ్ జిల్లా దోరు షాహబాద్‌లో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఆసిఫ్ మాలిక్ అనే ఉగ్రవాది హతం కాగా మరో భారత ఆర్మీ జవాన్ అమరుడయ్యారు.
దోరు షాహబాద్‌లో మిలిటెంట్స్ తలదాచుకున్నట్టుగా స్పష్టమైన సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గురువారం తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే భద్రతా బలగాలకు తారసపడిన మిలిటెంట్స్ ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో మిలిటెంట్స్, భద్రతా బలగాలకు మధ్య మొదలైన కాల్పులు ఎన్‌కౌంటర్‌కి దారితీశాయి. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా అక్కడి అధికారులు ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు.