ఉన్నావో రేప్ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు (Kuldeep singh sengar) శిక్ష ఖరారు మళ్లీ వాయిదా పడింది. సోమవారం ఈ కేసులో విచారణ పూర్తి చేసిన తీస్ హజారీ కోర్టు సెంగార్‌ను దోషిగా తేల్చింది. మంగళవారం శిక్షలు ఖరారు చేస్తామని ధర్మాసనం ప్రకటించింది. ఐతే గత కొన్నేళ్లుగా ప్రజా ప్రతినిధిగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగార్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆయన తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. దీంతో కోర్టు ఈ శిక్షల ఖరారును డిసెంబర్ 20 నాటికి వాయిదా వేసింది. అదే రోజు 2017లో ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ప్రస్తుతం కుల్దీప్ సెంగార్ తీహార్ జైలులో (Tihar Jail) ఉన్నారు. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న శశి సింగ్‌పై కోర్టు ఏమీ తేల్చలేదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలిపెట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : ఉన్నావ్ రేప్ కేసు: నిందితులను హైదరాబాద్ తరహాలో ఎన్‌కౌంటర్‌ చేయాలి.. బాధితురాలి తండ్రి డిమాండ్


ఉద్యోగం కోసం వెళితే.. అత్యాచారం..
బంగార్ మవూ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనపై గతేడాది అత్యాచారం కేసు నమోదైంది. 2017 జూన్‌లో తన ఇంటికి ఉద్యోగం కోసం వచ్చిన ఓ అమ్మాయిపై కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376, పోస్కో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ ఈ ఏడాది అక్టోబర్ 3న ఛార్జిషీట్ దాఖలు చేసింది. బాధితురాలిని కిడ్నాప్ చేసి 9 రోజులపాటు వేర్వేరు ప్రదేశాల్లో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.  


కేసులో ఎన్నో కీలక మలుపులు..
తొలుత బాధితురాలి ఆక్రందనను పోలీసులు పట్టించుకోలేదు. పైగా ఎమ్మెల్యే పలుకుబడికి పోలీసులు లొంగిపోయారు. దీంతో బాధితురాలి తండ్రిపై అక్రమాయుధాలు కలిగి ఉన్నాడంటూ పలు కేసులు నమోదు చేశారు. మరోసారి షాక్‌కు గురైన బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులు.. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ నివాసం ముందు మూకుమ్మడి ఆత్మహత్యకు ప్రయత్నించారు. కానీ ఆ మరుసటి రోజే పోలీస్ కస్టడీలో ఉన్న తండ్రి మృతి చెందారు. చివరకు గతేడాది ఏప్రిల్ 13న కుల్దీప్ సింగ్ సెంగార్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అత్యాచార సెక్షన్ల కింద కేసులు పెట్టారు.  


బాధితురాలి కుటుంబాన్ని అడ్డు తొలగించుకునేందుకు యత్నం..
రేప్ కేసు నమోదు చేయడంతో కుల్దీప్ సింగ్ అనుచరులు రెచ్చిపోయారు. ఏకంగా అత్యాచార బాధితురాలితోపాటు, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేయించేందుకు ప్రయత్నించారు. కోర్టు నుంచి వెళ్తున్న ఆమె కారును గుర్తుతెలియని వాహనంతో ఢీకొట్టించారు. ఈ ప్రమాదంలో ఆమె అత్త, చిన్నమ్మ మృతి చెందగా న్యాయవాదితోపాటు అత్యాచార బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె వాంగ్మూలం రికార్డు చేశారు. ప్రస్తుతం ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆమె కోలుకుంటోంది. కుల్దీప్ సింగ్‌ను దోషిగా నిర్ధారించారని తెలియగానే హర్షం వ్యక్తం చేసింది. ఐతే అతన్ని ఎప్పుడు ఉరి తీస్తారని ప్రశ్నించినట్లు ఆమె సోదరి మీడియాకు తెలిపారు.      


Read also : నిర్భయకు అశ్రు నివాళి.. ఏడేళ్లు పూర్తయినా దోషులకు అమలు కాని ఉరి శిక్ష


ఉన్నావో ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యేను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా మహిళలు డిమాండ్ చేశారు. రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్ సింగ్ సెంగార్‌ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. ఐతే కోర్టు దోషిగా తేల్చడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శిక్ష ఖరారైన అనంతరం ఆయన తన ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోనున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.