ఢిల్లీ: సీబీఐ వివాదంపై ఈ రోజు అత్యున్నత ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తనను బలవంతంగా సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ను  స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ రోజు దీనిపై విచారణ చేపట్టనుంది. అలోక్‌వర్మ తరఫున ఫాలి నారిమన్, సంజయ్ హెగ్డేలు వాదనలు వినిపించనున్నారు. కాగా సీవీసీ తరఫున అటార్నీ జనరల్ వాదనలు వినిపిస్తారు.


తనను అకారణంగా పదవి నుంచి తప్పించి సెలవులపై పంపించి కేంద్ర ప్రభుత్వం తనను అవమానించిందని ఒకవైపు సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ  వాదిస్తుంటే .. సీబీఐ డైరెక్టర్‌గా వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌గా అస్థానాను సెలవుపై మాత్రమే పంపామని.. వారిని పదవుల నుంచి తొలగించలేదని వారు తమ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని కేంద్రం వాదిస్తోంది . సీబీఐలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ మేరకు సెలవు ప్రకటించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. సిబిఐలో చోటుచేసుకుంటున్న తీవ్ర పరిణామాల నేపథ్యంలో ఈ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.